భయకంపం
3,00,000
2010 జనవరి 12న కరీబియన్ దేశమైన హైతీలో సంభవించిన భూకంపం.. మూడు లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. భూకంప
తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైనా.. భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది.
2,42,000
1976లో ఉత్తర చైనాలోని హెబియిలో 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం..
2.42 లక్షల మందిని బలి తీసుకుంది. 2008లో
నైరుతి చైనాలోని సిచౌన్‌లో 8.0 తీవ్రతతో నమోదైన భూకంపంలో 87,000 మంది గల్లంతయ్యారు.
ప్రకృతి శాపం
మానవాళిని వణికించే అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు మాత్రమే. భూకంపాలు ఎలా వస్తాయో తెలుసుకున్న శాస్త్రవేత్తలు, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం కచ్చితంగా చెప్పలేకపోవడమే ఇందుకు కారణం. ఏం జరుగుతోందో గ్రహించేలోగా అంతా జరిగిపోతుంది. భూకంపాలను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానం కోసం దశాబ్దాల తరబడి పరిశోధనలు సాగుతున్నా, ఇప్పటి వరకు ఆశాజనకమైన ఫలితాలేవీ లేవు.
ఎలా సంభవిస్తాయి?:
భూమి ఉపరితలం అకస్మాత్తుగా కదిలిపోవడాన్నే భూకంపం అంటారు. చాలాసార్లు ప్రకంపనలు ఏర్పడినా మనకు తెలియవు. భూమి నిర్మాణం మూడు పొరలతో ఏర్పడి ఉంది. అట్టడుగు పొర విపరీతమైన వేడిగా ఉంటుంది. అక్కడ ఇనుము కరిగిన స్థితిలో సలసలలాడుతూ ఉంటుంది. అట్టడుగు పొర చుట్టూ వ్యాపించిన మధ్య పొరలో కఠిన శిలలు ఉంటాయి. ఆ శిలలన్నీ అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవు. ఆ శిలలు భారీ పలకలుగా వ్యాపించి ఉంటాయి. వాటిని ‘టెక్టానిక్ ప్లేట్స్’ అంటారు. భూమి అట్టడుగున ఉండే వేడి కారణంగా ‘టెక్టానిక్ ప్లేట్స్’ నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ భారీ రాతి పలకలు ఒకదానిని మరొకటి పెనువేగంతో ఒరుసుకుంటూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ప్రకంపనలు ఏర్పడతాయి.
వాటినే భూకంపాలు అంటాం. ‘టెక్టానిక్ ప్లేట్స్’ కదలికల కారణంగా భూమి అట్టడుగున కొన్ని బలహీన ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఇవి ‘టెక్టానిక్ ప్లేట్స్’ సరిహద్దుల వద్ద ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. చిలీ నుంచి ఉత్తర అమెరికా తీరం, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ పరిసర ప్రాంతాలతో కూడిన ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’, మధ్యధరా ప్రాంతం, భారత్‌లోని హిమాలయ ప్రాంతం, గంగా-బ్రహ్మపుత్ర తీర ప్రాంతం, కచ్ ప్రాంతం, అండమాన్-నికోబార్ దీవులు వంటివి ఇలాంటి బలహీన ప్రదేశాలే. భూమి అడుగున ఉన్న పొరలలో ఏర్పడే కదలికలతో పాటు అగ్నిపర్వతాల్లో తలెత్తే మార్పుల వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఉపరితలం అడుగున కాకుండా, సముద్రగర్భంలో ఏర్పడే భూకంపాలు సునామీలకు దారితీస్తాయి.
ఏం జరుగుతుంది?:
భూకంపాల వల్ల విధ్వంసం మాత్రమే కాదు, భూమి ఉపరితలంపై కాలక్రమంలో పెనుమార్పులూ సంభవిస్తాయి. తీవ్రమైన భూకంపం ధాటికి దేశాలకు దేశాలే భౌతికంగా అవి ఉన్న చోటి నుంచి మరో చోటికి కదిలిపోతాయి. ఉదాహరణకు వందకోట్ల ఏళ్ల కిందట అమెరికా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో లేదు. చాలా ఖండాలదీ అదే పరిస్థితి. శతకోటి సంవత్సరాల కిందట అవి ఉన్న ప్రదేశం నుంచి భౌతికంగా చాలా దూరం జరిగిపోయాయి. భూమి అడుగున ఉన్న ‘టెక్టానిక్ ప్లేట్స్’ కదలికల ఫలితంగానే ఇవి క్రమేపీ దూరం దూరంగా జరిగాయి. అంతేకాదు, భూమి ఉపరితలంపై పర్వతాలు, లోయలు కూడా వాటి ఫలితంగానే ఏర్పడ్డాయి. భూమి అడుగునున్న లావా భారీస్థాయిలో ఎగజిమ్మి, ఉపరితలానికి చేరుకోగా అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. భూమి అడుగున ఉండే ‘టెక్టానిక్ ప్లేట్స్’ దాదాపు 50 మైళ్ల మందాన ఉంటాయి. ఇవి ఏడాదికి కనీసం అర అంగుళం నుంచి కొన్ని అంగుళాల మేరకు ఏదో ఒక దిశలో కదులుతాయి. ఒక టెక్టానిక్ ప్లేట్ ఏడాదికి అర అంగుళం చొప్పునే కదిలిందనుకుంటే, పదేళ్లకు ఐదు అంగుళాలు, ఆ లెక్కన పదిలక్షల ఏళ్లకు 8 మైళ్ల దూరం కదులుతుంది. గడచిన కోటాను కోట్ల సంవత్సరాల వ్యవధిలో భూమిపై ఉన్న ఖండాలకు ఖండాలే తాము ఉన్న చోటి నుంచి మైళ్లకు మైళ్లు జరిగిపోయాయి. ఐదేళ్ల కిందట న్యూజిలాండ్‌లో సంభవించిన భూకంపం ధాటికి ఉపరితలంపై ఏకంగా పదకొండు అంగుళాల చీలిక ఏర్పడింది.
పది భూప్రళయాలు..
నేపాల్‌ను వణికించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.9గా నమోదైంది. చరిత్ర పుటలు తిరిగేస్తే..
ఎన్నో భూకంపాలు ప్రపంచ దేశాలను విలవిల్లాడేలా చేశాయి.
1. చిలీ: 1960 మే 22; భూకంప తీవ్రత: 9.5
ఈ భారీ భూకంపం 1,655 మందిని పొట్టన పెట్టుకుంది. 20 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది.
2. అలాస్కా: 1964 మార్చి 28; తీవ్రత: 9.2
భూకంపం వల్ల సునామీగా ఉప్పొంగిన సముద్ర కెరటాలు 128 మందిని బలిగొన్నాయి. 311 మిలియన్ డాలర్ల ఆస్తిన ష్టం జరిగింది. ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోయినా.. చరిత్రలో ఇది రెండో అతిపెద్ద భూకంపంగా నిలిచిపోయింది.
3. ఇండోనేసియా: 2004 డిసెంబర్ 26; తీవ్రత: 9.1 హిందూ మహా సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం.. దక్షిణాసియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని 14 దేశాలను కుదిపేసింది. 2.30 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. సునామీ తాకిడికి చెన్నై సహా భారత్‌లోని దక్షిణ తీరప్రాంతంలో 18,000 మందికి పైగా జలసమాధి అయ్యారు.
4. జపాన్: 2011 మార్చి11;తీవ్రత: 9.0
జపాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. సునామీ ధాటికి న్యూక్లియర్ రియాక్టర్స్ తీవ్రంగా దెబ్బతినడంతో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ఏర్పడింది.
5.రష్యా: 1952 నవంబర్ 4; తీవ్రత: 9.0
కామ్‌చత్క పెనిన్‌సులాలో సంభవించిన భూకంపం పసిఫిక్ మహా సముద్ర అలలను సునామీ కెరటాలుగా మార్చేసింది.
6. చిలీ: 2010 ఫిబ్రవరి 27, తీవ్రత: 8.8
పసిఫిక్ మహాసముద్రం అంచున 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 521 మంది ప్రాణాలు కోల్పోయారు.
7. ఈక్వెడార్:
1906 జనవరి 31; తీవ్రత: 8.8
పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన సునామీ.. ఈక్వెడార్‌తోపాటు కొలంబియా తీరప్రాంతాన్ని కకావికలం చేసింది. రెండు వేల మంది చనిపోయారు.
8. ర్యాట్ ఐలాండ్, అలస్కా:
1965 ఏప్రిల్ 2; తీవ్రత: 8.7
భూకంప తీవ్రత కన్నా.. సునామీ ఎక్కువగా కలవరపెట్టింది.
9. ఇండోనేషియా:
2005 మార్చి 28; తీవ్రత: 8.6
సమత్రా దీవుల్లో కంపించిన భూమి.. కడలిలో కల్లోలాన్ని సృష్టించింది. శ్రీలంక వరకు భీకరమైన అలల తాకిడితో అలజడి రేపింది.
10. అస్సాం, టిబెట్:
1950 ఆగస్ట్ 15, తీవ్రత: 8.6
అస్సాం, టిబెట్ సరిహద్దులో సంభవించిన ఈ భూకంపంలో 800 మంది మరణించారు.
భూకంపం.. దాని తీవ్రత..
భూకంపాలకు సంబంధించిన వార్తలు వెలువడినప్పుడల్లా రిక్టర్ స్కేల్‌పై ఎంత నమోదైందో ఆ తీవ్రత తెలుస్తుంది. రిక్టర్ స్కేల్‌పై ఎంత తీవ్రత నమోదైతే, వాస్తవంగా ఎంత నష్టం వాటిల్లుతుందో ఆ వివరాలు వార్తల్లో ఉండవు. తీవ్రమైన భూకంపాలు అణుబాంబు పేలుళ్లకు సమానమైన నష్టాన్ని కలిగిస్తాయి.
రిక్టర్ టీఎన్‌టీ పేలుడుతో ఎన్ని అణుబాంబులకు
స్కేల్ విడుదలయ్యే శక్తి సమానం?
4.0 1 కిలోటన్ను ఒక చిన్న అణుబాంబు
5.0 32 కిలోటన్నులు నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు
6.0 1 మెగాటన్ను 10 నాగసాకి అణుబాంబులు
7.0 32 మెగాటన్నులు భారీ థర్మోన్యూక్లియర్
ఆయుధం (100 అణుబాంబులు)
8.0 1 గిగాటన్ను 1000 అణుబాంబులు
9.0 32 గిగాటన్నులు 10 వేల అణుబాంబులు
నేపాల్ భూకంపం ఎలా వచ్చింది?
నేపాల్‌లో భూకంపం ఎలా సంభవించిందనే దానిపై అమెరికా భూగర్భ అధ్యయన సంస్థ వివరాలు వెల్లడించింది. భారత టెక్టానిక్ ప్లేట్, దానికి ఉత్తరానే ఉన్న యూరేసియా టెక్టానిక్ ప్లేట్‌ల కదలికల కారణంగానే ఈ భూకంపం ఏర్పడింది. నేపాల్ రాజధాని కఠ్మాండుకు ఈశాన్యాన 50 మైళ్ల దూరంలో శనివారం భూకంపం ఎందుకు సంభవించిందంటే, భారత టెక్టానిక్ ప్లేట్ ఏడాదికి రెండు అంగుళాల వేగంతో యూరేసియా టెక్టానిక్ ప్లేట్‌ను తాకింది. ఈ భూకంప కేంద్రం భూమికి కేవలం ఏడు మైళ్ల అడుగున ఉంది. అందువల్లనే చాలా దూరం వరకు ప్రకంపనలు వ్యాపించాయని అమెరికా భూగర్భ అధ్యయన సంస్థ చెబుతోంది. నేపాల్ భూకంపం ఫలితంగా శనివారం పొరుగునే ఉన్న భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, టిబెట్‌లలో ప్రకంపనలు ఏర్పడ్డాయి.
మంచుకొండలే ముంచును..
హిమాలయాల చెంతన ఉన్న నేపాల్.. తీవ్ర భూకంపాలు సంభవించే డేంజర్ జోన్‌లో ఉందంటున్నారు భూగర్భ పరిశోధకులు. భూమి అంతరాల్లోని టెక్టానిక్ పలకల రాపిడి భూకంపాలకు అసలు కారణం. ఇండియన్ టెక్టానిక్ పలక, సెంట్రల్ ఆసియా భూభాగానికి సంబంధించిన యూరేసియా టెక్టానిక్ పలక భారీగా ఢీ కొట్టుకోవడం వల్లే హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయి. భూగర్భంలోని ఈ రెండు బలమైన పొరలు తరచూ రెండు అంగుళాలు అటు ఇటుగా కదులుతుంటాయి. అలాంటి సందర్భాల్లో భూకంపాలు సంభవించే అవకాశాలున్నాయి. ఈ రెండు పలకలు కాస్త గట్టిగా ఢీకొంటే భారీ భూవిలయం తప్పదు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ పరిధిలో ఉన్న హిమాలయాలు ఏర్పడిన సందర్భంలోనే.. భూగర్భంలో కొన్ని తేడాలు ఏర్పడ్డాయంటున్న శాస్త్రవేత్తలు.. ఆ అంతరాల్లోని తేడాలు సర్దుబాటయ్యే క్రమంలో భూకంపాలు ఏర్పడతాయని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన మంచుకొండల కు దగ్గరగా ఉన్న నేపాల్‌కు భూప్రకోపం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
జననష్టం దృష్ట్యా భారత భూభాగంపై సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాలు
కాశ్మీర్ భూకంపం: అక్టోబర్ 8, 2005
ప్రభావిత ప్రాంతాలు: జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్
జననష్టం: దాదాపు 86,000 మంది.
వీరిలో 80శాతం మంది పీవోకేలో ఉన్నవారే.
గుజరాత్ భూకంపం
జనవరి 26, 2001
ప్రభావిత ప్రాంతం: కచ్ జిల్లా
జననష్టం: 20,000 మంది
కాంగ్రా భూకంపం: ఏప్రిల్ 4, 1905
ప్రభావిత ప్రాంతం: హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయ
జననష్టం: దాదాపు 20,000 మంది
లాతూర్ భూకంపం: సెప్టెంబర్ 30, 1993
ప్రభావిత ప్రాంతాలు: మహారాష్ట్రలోని లాతూర్, ఉస్మానాబాద్
జననష్టం: 9,000 మంది
మానవుల నిర్వాకాలూ కారణమే..
భూమి లోలోపలి పొరల్లో కదలికలు, అగ్నిపర్వతాలలో తలెత్తే మార్పులు పూర్తిగా ప్రకృతిపరమైనవి. వాటిని ఎలాగూ నియంత్రించలేం. అయితే, మానవుల నిర్వాకాల వల్ల కూడా కొన్నిసార్లు భూకంపాలు సంభవిస్తుంటాయి. విచ్చలవిడిగా గనులు తవ్వేసి, వాటిలోని ఖనిజాలను ఖాళీచేసి వదిలేశాక, అవి కుప్పకూలిన సందర్భాల్లో స్వల్పస్థాయి భూకంపాలు సంభవిస్తుంటాయి. భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. భారీ డ్యాముల వెనుక రిజర్వాయర్లలో భారీ పరిమాణంలో నీటిని నిల్వచేయడం వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా కూడా భూకంపాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ వద్ద 1967లో ఏర్పడిన భూకంపం ఇలాంటిదే. కోయినా డ్యామ్ నిర్మాణం 1963లో పూర్తవగా, రిజర్వాయర్ నీటితో నిండుతున్న సమయంలో చాలాసార్లు ప్రకంపనలు ఏర్పడ్డాయి. చివరకు 1967లో తీవ్ర భూకంపమే సంభవించి, 200 మంది మరణించారు. ఆ భూకంపం ఫలితంగా కోయినా డ్యామ్‌కు కూడా బీటలుపడ్డాయి.
భవనాల వల్లే భారీ నష్టం
భూకంపాల కారణంగా ఎవరూ మరణించరు, భవనాల కారణంగానే మరణిస్తారు అని నిపుణులు అంటారు. భూకంపాలు సంభవించినప్పుడు భారీ భవనాలలో కాకుండా, ఆరుబయట ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. భూకంపాలను తట్టుకునే రీతిలో భవనాలను నిర్మించడం వల్ల ఈ నష్టాన్ని నివారించవచ్చు. భవనాల పునాదులకు, ఫ్లోరింగ్‌కు మధ్య బేరింగ్‌లు ఏర్పాటు చేయడం, గోడల నిర్మాణంలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా భూకంపాల నుంచి భవనాలు కూలిపోకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై కొలుస్తారు.
రిక్టర్ స్కేల్‌పై 3 కంటే తక్కువగా నమోదయ్యే భూకంపాలు దాదాపు ప్రతిరోజూ సంభవిస్తుంటాయి. అవి సంభవించినట్లు కూడా ఎవరికీ తెలియదు. రిక్టర్ స్కేల్‌పై 3-5 వరకు నమోదయ్యే భూకంపాలను స్వల్పస్థాయి నుంచి ఒక మోస్తరు భూకంపాలుగానే పరిగణిస్తారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5-7 వరకు ఉంటే ఒక మోస్తరు నుంచి తీవ్ర భూకంపాలుగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా, 7-8 వరకు నమోదయ్యే భూకంపాలను పెను భూకంపాలుగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏడాదికి ఒకటైనా పెను భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి పెను భూకంపాల కారణంగానే భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతాయి. ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్‌పై 10 వరకు నమోదైన భూకంపం ఒక్కటైనా సంభవించలేదు. అలాంటిదే సంభవిస్తే, అప్పుడు వాటిల్లే నష్టాన్ని ఊహించడమే అసాధ్యం.