German Research Center doing research to detect earthquakes - Sakshi
Sakshi News home page

భయంపుట్టిస్తున్న భూకంపాలు.. ‘డాస్‌’ వ్యవస్థతో శాస్త్రవేత్తల ప్రయోగాలు.. ముందే పసిగట్టేందుకు ప్లాన్‌!

Published Thu, Feb 23 2023 4:03 AM | Last Updated on Thu, Feb 23 2023 9:00 AM

German Research Center doing research to Detect earthquakes - Sakshi

తుపాను వస్తుందని, చేపల వేటకు వెళ్లొద్దని రెండు వారాల ముందే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అగ్ని పర్వతం బద్దలవుతుందని వారం ముందే సమాచారం వస్తోంది. పిడుగులు ఎక్కడ పడతాయో మొబైల్‌ ఫోన్లకు సమాచారం అందుతోంది. 

కానీ.. క్షణాల్లో భారీ విధ్వంసం సృష్టించే భూకంపాలను ముందుగా పసిగట్టలేకపోతున్నాం. ఇప్పుడు దీనిపైనే శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ముందస్తుగా భూకంపాల తీవ్రతను తెలుసుకొని, ప్రాణ నష్టాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టారు. 

కె.జి. రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): ప్రస్తుతం సిస్మోమీటర్‌ ద్వారా కేవలం కొన్ని సెకన్ల ముందు మాత్రమే భూకంపాలను తెలుసుకుంటున్నాం. అప్పటికే ఘోరం జరిగిపోతోంది. తుర్కియే, సిరియాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం దెబ్బకు వేలాది మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది.

ఇలా భారీ నష్టం జరగకుండా ఆప్టిక్‌ కేబుల్‌ వ్యవస్థ ద్వారా భూకంపాల తీవ్రతని కొన్ని గంటల ముందుగానే తెలుసుకొనేలా చేస్తున్న ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (జియోసైన్సెస్‌) చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే భూకంపాల వల్ల కలిగే భారీ ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. 

ఏమిటీ ప్రయోగం! 
ప్రపంచంలో ఏటా 20 వేలకు పైగా భూకంపాలు నమోదవుతున్నాయి. సగటున రోజుకు 50 ప్రకంపనలు,  వస్తుంటాయి. వీటి సమాచారాన్ని సిస్మోమీటర్‌ ద్వారా తీసుకుంటున్నారు. భూకంప తీవ్రతని రిక్టర్‌ స్కేల్‌పై కొలుస్తున్నారు. ఇప్పుడు కేబుల్స్‌ ద్వారా భూకంపాల తీవ్రత సమాచారాన్ని ముందుగానే సేకరించేందుకు డిస్ట్రిబ్యూటెడ్‌ ఎకౌస్టిక్‌ సెన్సింగ్‌ (డాస్‌) వ్యవస్థని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం టెలీకమ్యూనికేషన్స్‌ కోసం భూమి లోపల ఏర్పాటు చేస్తున్న ఈ ఆప్టిక్‌ కేబుల్స్‌కు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన కదలికలను గుర్తించే సామర్థ్యం ఉందని, వీటి  ద్వారా భూమి లోపల సంభవించే భూకంప తరంగాలను, అగ్నిపర్వత విస్ఫోటనాలను ముందుగానే గుర్తించొచ్చనేది పరిశోధకుల ఆలోచన.

‘‘ఈ కేబుల్స్‌ను నిరంతరం గమనించి, వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరిస్తే భూకంప తీవ్రతను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది’’ అని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌(జియోసైన్సెస్‌)లో పనిచేసే జియోసైంటిస్ట్‌ ఫిలిప్స్‌ జోసెట్‌ వివరించారు. 

ఎలా సాధ్యమవుతుంది? 
తొలుత డాస్‌ ద్వారా ఇటలీలోని ఎట్నా అగ్నిపర్వతం కార్యకలాపాల్ని పరిశీలించారు. పర్వతం బద్దలయ్యేందుకు కొంత ముందుగా వచ్చే ప్రారంభ కంపనల సమాచారాన్ని ఇది చేరవేసింది. ఇదే తరహాలో భూకంపాలు జరిగినప్పుడు భూ అంతర్భాగంలో జరిగే ప్రాథమిక కదలికల్ని గుర్తించవచ్చు. అంటే.. సెకనుకు 3.7 మైళ్ల వేగంతో ప్రయాణించే ప్రాథమిక భూకంప ప్రకంపనాలు (పి–తరంగాలు) నమోదైన వెంటనే  కేబుల్‌ వ్యవస్థ ద్వారా సమాచారం అందుతుంది.

ఈ పి–తరంగాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగదు. ఆ తర్వాత సెకనుకు 2.5 మైళ్ల వేగంతో వచ్చే సెకండరీ తరంగాలు (ఎస్‌–వేవ్స్‌) వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. మొదటి తరంగాల సమాచారం స్టేషన్ల నుంచి రాగానే.. వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.5 కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే భారీ ప్రమాదం సంభవిస్తుందని పసిగడతారు.

వెంటనే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపిస్తారు. మాగ్నిట్యూడ్‌ 4.5 కంటే ఎక్కువ ఉంటే గూగుల్‌ షేక్‌ అలెర్ట్‌ ద్వారా  హెచ్చరికలు పంపే వ్యవస్థని రూపొందించారు. దీనికి గూగుల్‌తో భాగస్వామ్యమైనట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 

తుర్కియే, సిరియాకంటే ముందు వచ్చిన అతి పెద్ద 10 భూకంపాలు 
► మొదటిది దక్షిణ అమెరికాలోని చిలీలో 1960 మే 22న వచ్చింది. ఇదే అతి తీవ్రమైనది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 9.5గా నమోదైంది. దీనివల్ల దూసుకొచ్చిన తరంగాలు దాదాపు భూమి మొత్తం ప్రయాణించాయి. 1,655 మంది మరణించగా 3 వేల మంది క్షతగాత్రులయ్యారు. 550 మిలియన్‌ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.  

► 1964 మార్చి 28న అలస్కాలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనిని గుడ్‌ ఫ్రైడే భూకంపం అని కూడా పిలుస్తారు. 131 మంది చనిపోయారు.  

► 2004 డిసెంబర్‌ 26న సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీగా మారింది. ఇది 14 దేశాలపై ప్రభావం చూపింది. 2,27,900 మంది మృత్యువాత పడ్డారు.  

► 2011 మార్చి 11న జపాన్‌లోని సెండాయ్‌లో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చిన అనంతరం సునామీ కూడా సంభవించింది. 10 వేల మందికి పైగా విగతజీవులయ్యారు. 

► 1952 నవంబర్‌ 4న రష్యాలోని కంచట్కా (హవాయి దీవులు)లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 10 లక్షల అమెరికన్‌ డాలర్ల ఆస్తినష్టం సంభవించింది. 

► 2010 ఫిబ్రవరి 27న చిలీలోని బయోబియో ప్రాంతంలో వచ్చిన భూకంపం తీవ్రత 8.8గా నమోదైంది. ఈ ప్రమాదంలో 600 మంది చనిపోయారు. 

► 1906 జనవరి 31న ఈక్వెడార్‌ ఆఫ్‌ కోస్ట్‌లో 8.8 తీవ్రతతో భూకంపం, దాని వెంటే వచ్చిన సునామీ కారణంగా 500 మంది మృత్యువాత పడ్డారు. 

► 1965 ఏప్రిల్‌ 2న అలస్కాలోని రాట్‌ ఐలాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 8.7గా నమోదైంది. 

► 2005 మార్చి 28న ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 1,313 మంది మృత్యువాత పడగా, 500 మంది గాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement