ప్రతి నిమిషమూ కంపనమే!
ప్రతి నిమిషానికీ ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంటుంది! ప్రపంచంలో ప్రతియేటా కనీసం 8,000 మంది భూకంపాలకు బలి అవుతున్నారని అంచనా. రిక్టర్ స్కేల్‌పై 3.0 కన్నా ఎక్కువ స్థాయిలో నమోదయ్యే భూకంపాలు ఏడాదికి కనీసం 8000 సంభవిస్తూ ఉంటాయి. అంతకన్నా తక్కువస్థాయి భూకంపాలు వందలకొద్దీ వచ్చిపోతున్నా వాటి ప్రభావం ఎక్కడా కనిపించదు. భూ దక్షిణార్ధగోళం వైపు కన్నా ఉత్తరార్ధగోళంలోనే ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి.
ఎక్కువగా భూకంపాలను ఎదుర్కొనేది జపనీయులు. జపాన్ పరిధిలో వారానికి కనీసం ఒకసారి అయినా భూకంపం సంభవిస్తూనే ఉంటుంది.
జపనీయుల నమ్మకం ప్రకారం భూకంపాలు ‘నమజు’గా పిలుచుకొనే ఒక క్యాట్‌ఫిష్ వల్ల సంభవిస్తాయి. ప్రాచీన గ్రీకుల విశ్వాసం ప్రకారం భూకంపం సముద్రదేవుడయిన పొసేడియన్ ఆగ్రహానికి ప్రతిరూపం. అలాగే భూమి లోపల నుంచి భయంకరమైన గాలులు వస్తాయనీ, అవే భూకంపాలకు
కారణమనీ గ్రీకులు విశ్వసించేవారు.
ఇతరగ్రహాలు, ఉప గ్రహాలపై కూడా కంపాలు తప్పవని అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంటారు. చంద్రుడిపై కూడా ఇవి నమోదవ్వడాన్ని గుర్తించారు. చందమామపై సంభవించే వీటిని ‘మూన్ క్వేక్స్’అంటారు.
చాలా రకాల జీవజాతులకు భూకంపాలను గుర్తించే శక్తి ఉందని జీవశాస్త్ర పరిశోధకులు అంటారు. కుక్కలు, ఎలుకలు, కోళ్లు మొదలైనవి భూకంపాలను ముందుగానే గుర్తిస్తాయి. ‘జర్నల్ ఆఫ్ జువాలజీ’ అధ్యయనం ప్రకారం కప్పలు భూకంపాలను ముందుగానే గ్రహించి, దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి దూరంగా ప్రయాణం ప్రారంభిస్తాయి!
కాలిఫోర్నియాలోని పార్క్‌ఫీల్డ్‌ను ‘ది ఎర్త్‌క్వేక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా వ్యవహరిస్తారు. రెండు టెక్టానిక్ ప్లేట్ల కలయిక వద్ద ఉన్న ఆ ప్రాంతంలో తీవ్రంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఏనాటికి అయినా భూకంపంతో తీవ్ర ప్రభావం పడగల నగరమని కాలిఫోర్నియా విషయంలో ఆందోళనలున్నాయి.
భూ స్వభావాన్ని బట్టి భూకంపాలు సంభవించే అవకాశాలు ఉంటాయని మొట్ట మొదట సూత్రీకరించింది అరిస్టాటిల్.
రెండువేల సంవత్సరాల క్రితం చైనా పరిశోధకుడు జాంగ్‌హెంగ్ తొలిసారి ఎర్త్‌క్వేక్ డిటెక్టర్‌ను కనుగొన్నాడు. దాదాపు ఆరువందల కిలోమీటర్ల ఆవల సంభవించే భూకంపాలను కూడా అది గుర్తించగలదు.
1935లో అమెరికన్ పరిశోధకుడు చార్లెస్ రిక్టర్ భూకంపాన్ని కొలిచే ‘రిక్టర్ స్కేల్’ రూపొందించారు.
భయోత్పాతాన్ని కలిగించిన భూకంప ఛాయాచిత్రాలకు ప్రపంచ వ్యాప్త ఆదరణ ఉంటుంది. ఫొటోల ద్వారా వార్తల్లోకెక్కిన భూకంపాల్లో 1906లో కాలిఫోర్నియాలో సంభవించినదే తొలి బీభత్సం.