
వాషింగ్టన్ : పెను భూకంపాలు ప్రపంచదేశాలను 2018లో అతలాకుతలం చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. భూ పరిభ్రమణంలో చోటు చేసుకున్న స్వల్ప మార్పులే ఇందుకు కారణమని చెప్పారు. మార్పులు చిన్నవే అయినా పరిణామాలు మాత్రం తీవ్రంగా, కనివీని ఎరుగనంతగా ఉంటున్నాయని తెలిపారు.
ముఖ్యంగా అధిక జనావాస ప్రాంతాలపై పెను విపత్తులు విరుచుకుపడాతాయని తెలిపారు. భూ పరిభ్రమణం నెమ్మదించడం వల్ల రోజులో పగటి సమయం ఒక్క మిల్లీ సెకండ్ పాటు తగ్గిందని వెల్లడించారు. మార్పు స్వల్పంగానే ఉన్నా.. భూ అంతర్భాగంలో జరిగే పరిణామాలు పెను విపత్తును సృష్టిస్తాయని చెప్పారు.
భూ పరిభ్రమణానికి.. పెను భూకంపాలకు సంబంధం ఏంటి?
భూమి పరిభ్రమణానికి, భూకంపాలు రావడానికి మధ్య సంబంధాన్ని గత నెలలో యూనివర్సిటీ ఆఫ్ కొలరెడో ప్రొఫెసర్లు రోగర్ బిల్హమ్, బెండిక్‌లు వివరించారు. భూమి పరిభ్రమించడానికి, భూమి పొరలకు మధ్య బలమైన సంబంధం ఉందని వెల్లడించారు. భూ పరిభ్రమణంలో మార్పులు వస్తే భూమి పొరల్లో కూడా మార్పులు చోటు చేసుకుని విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుందని తెలిపారు.
1900 సంవత్సరం నుంచి నేటి వరకూ భూకంప తీవ్రత 7.0 దాటిన వాటిపై తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందని చెప్పారు. గత 116 ఏళ్లలో కేవలం ఐదంటే ఐదే సమయాల్లో( ఐదు టైమ్ పిరియడ్‌లలో) భూకంపాలు సాధారణంగా కంటే ఎక్కువ సార్లు సంభవించాయని వెల్లడించారు.
సాధారణ సమయాల్లో ప్రపంచ దేశాల పాలిట పెను విపత్తుగా మారిన భూకంపాల సంఖ్య సంవత్సరానికి 15గా ఉండగా.. తాము పేర్కొన్న ఐదు సమయాల్లో మాత్రం ఏడాదికి సంభవించిన పెను భూకంపాల సంఖ్య 25 నుంచి 30 వరకూ ఉన్నట్లు బిల్హమ్ పేర్కొన్నారు. భూమి పరిభ్రమణం నెమ్మదించడాన్ని అణు గడియారాల ద్వారా గుర్తించొచ్చని చెప్పారు.
ఐదేళ్ల పాటు వరుసగా..
కొన్నిసార్లు వరుసగా ఐదేళ్ల కాలం పాటు భూమి పరిభ్రమణం నెమ్మదించిందని బిల్హమ్, బెండిక్‌లు తెలిపారు. ఆ సమయంలో పెను భూకంపాలు మానవాళిపై విరుచుకుపడ్డాయని చెప్పారు. అలాంటి సమయమే ప్రస్తుతం (2013-2018ల మధ్య) జరుగుతోందని వెల్లడించారు. అదృష్టవశాత్తు గడచిన నాలుగేళ్లలో కేవలం ఆరు పెను భూకంపాలను మాత్రమే మనం చవిచూశామని చెప్పారు.
2018 ఆరంభం నుంచి పెను భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. ఏడాది మొత్తంలో దాదాపు 20కుపైగా పెను భూకంపాలు సంభవిస్తాయని చెప్పారు. అయితే, పెను భూకంపాలు ఎందుకు ఉద్భవిస్తున్నాయన్న ప్రశ్నకు సరైన కారణాన్ని శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. ఏయే ప్రదేశాల్లో పెను భూకంపాలు సంభవిస్తున్నాయన్న విషయాన్ని బిల్హమ్ చెప్తూ.. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న జనావాస ప్రాంతాల కేంద్రంగా సంభవిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment