![There were conspiracies to defame Gujarat says PM Narendra Modi - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/29/SMRITI-VAN-MEMORIAL-5.jpg.webp?itok=dg2fyl92)
స్మృతివనాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.
అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్‌ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్‌టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్‌లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు.
‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్‌లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు.
అవగాహన పెరగాలి
పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు.
ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్‌తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు.
‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment