పారిస్: ఆసియాలోని పలు దేశాలు, నగరాలు తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ దేశాల కన్నా ఆఫ్రికాలోని ఉపసహారా ప్రాంతాల ప్రజల కు ఎక్కువ హాని పొంచి ఉన్నట్లు రిస్క్ అనలిస్ట్స్ వెరిస్‌క మ్యాపుల్‌క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. దక్షిణాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని దాదాపు 140 కోట్ల మంది ప్రజలు వరదలు, తుపానులు, సముద్రాలు ఉప్పొంగడం, భూకంపాల్లో ఏదో ఒక విపత్తు బారిన పడుతున్నారని పేర్కొంది.
బంగ్లాలో 100% మంది ప్రజలకు ముప్పు పొంచి ఉండగా, భారత్‌లో 82 శాతం, పాక్‌లో 70 శాతం మంది విపత్తుల బారిన పడతారంది. వీటితో పాటు చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లోని అధిక ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నారని వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలో ఈ విపత్తుల కారణంగా అధిక మరణాలు సంభవించడమే కాకుండా గాయాలు, రోగాల బారిన పడుతున్నారు.