ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేల జాబితాలో మరొకరు చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను సీఎం కేసీఆర్‌ను కలసి గిరిజన ప్రాంత అభివృద్ధిపై చర్చించానన్నారు. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడిన మాటలు స్వార్థ రాజకీయం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రస్ఫుటించాయని, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన విజన్, దాని కోసం ఆయన పడుతున్న తపన తనను మంత్రముగ్ధురాలిని చేశాయని లేఖలో హరిప్రియ పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రూపొందించిన ప్రణాళికలు తనను ఆకర్షింపజేశాయని, శతాబ్దాల చరిత్రగల ఇల్లెందు ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, గిరిజనం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ బాటలో పయనించడమే శ్రేయస్కరమని, అందుకే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు, వారికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులతో మాట్లాడానని, అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో హరి ప్రియ పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రమే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అందరూ భావిస్తున్నారని, అందుకే అందరి నిర్ణయం మేరకు కేసీఆర్ బాటలో నడిచి బంగారు తెలంగాణలో భాగమవుతానని ప్రకటించారు. అవసరమైతే కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ బీఫారంపై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని లేఖలో హరిప్రియ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment