ఇల్లెందు : పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయడంతో ఉనికి కోల్పోయిన భద్రాచలం ఐటీడీఏను అక్కడి నుంచి తరలించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే అందుకు అన్ని విధాలుగా అనువైన ప్రదేశం ఇల్లెందేనని, ఈ దిశగానే తరలింపు ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు సీమాంధ్రలో విలీనం చేసిన నేపథ్యంలో భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ తన అస్తిత్వాన్ని కోల్పోతున్నందున అక్కడి నుంచి తరలించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఐటీడీఏ ప్రస్థానం ఇలా..
మొదట 1974-75 సంవత్సరంలో ఐటీడీఏను ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాలనా సౌలభ్యం కోసం 1979లో పాల్వంచకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి 1993లో భద్రాచలానికి మార్చారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 29 మండలాలు ఉన్నాయి. భద్రాచలం డివిజన్‌లోని 8 మండలాలు, పాల్వంచ డివిజన్‌లో 10, కొత్తగూడెం డివిజన్‌లో 11 మండలాల పాలన ఈ ఐటీడీఏ నుంచే కొనసాగుతోంది.
వీటితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. 904 గ్రామాలు, 12,175 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భద్రాచలం ఐటీడీఏ కింద 5.61 లక్షల మంది గిరిజనులున్నారు. జిల్లా వ్యాప్తంగా 6.83 లక్షల మంది గిరిజనులు ఉండగా ఐటీడీఏ సబ్ ప్లాన్ పరిధిలోనే 5.61 మంది ఉండడం గమనార్హం. గిరిజనుల అత్యధికంగా వెనుకబడి ఉన్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, గుండాల, పినపాక మండలాలు దీని పరిధిలోనివే.
చింతూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ గిరిజనులు కొండలపైనే నివసిస్తున్నారు. వీరందరికీ అందుబాటులో ఉండేలా భద్రాచలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అప్పట్లో అధికారులు భావించారు. అయితే నేడు భద్రాచలం డివిజన్ నుంచి కీలకమైన మండలాలు సీమాంధ్రలో కలుపుతూ నిర్ణయం తీసుకోవటంతో ఐటీడీఏ కొనసాగేందుకు సైతం స్థలం లే కుండా పోయింది.
భధ్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలల్లో 337 గ్రామాల్లో 2.97 లక్షల జానాభా ఉండగా, ఇందులో 324 గ్రామాలకు చెందిన 1.90 లక్షల మందిని ఆంధ్రలో విలీనం చేస్తున్నారు. కేవలం 13 గ్రామాల్లోని 1.07 లక్షల జనాభా మాత్రమే తెలంగాణలో మిగులుతున్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ గ్రామాల్లో అత్యంత వెనుకబడిన గిరిజనులు నివసించే కీలక మండలాలు ఆంధ్రలో విలీనం చేస్తున్న తరుణంలో ఐటీడీఏను భద్రాచలం నుంచి మరో ప్రాంతానికి తరలించాల్సి వస్తుందనే ప్రచారం సాగుతోంది.
ఇల్లెందే అనువైనదా..?
ఐటీడీఏను భధ్రాచలం నుంచి పాల్వంచ, ఇల్లెందులలో ఎదో ఒక ప్రాంతానికి తరలించాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇల్లెందులోనే ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. అధికారులు సైతం భద్రాచలం నుంచి ఐటీడీఏను తరలించాల్సి వస్తే ఇల్లెందే అనువైన ప్రదేశ మని భావిస్తున్నట్లు సమాచారం.
గిరిజన యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇల్లెందులోని కరెంటాఫీస్ సమీపంలో రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ భవనాన్ని ఐటీడీఏ కార్యాలయానికి ఉపయోగించుకోవచ్చని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని, ఈలోగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
ముంపు ఎఫెక్ట్ .. ఇల్లెందుకు ఐటీడీఏ ?
Published Wed, Aug 13 2014 3:04 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement