
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై టీఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడిని తమ పార్టీ ఖండిస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, బెదిరింపులకు గురిచేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రోడ్లపై అధికార పార్టీ సహా ఏ రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు పెట్టినా, చివరకు తన ఫ్లెక్సీలు పెట్టినా తొలగించాలని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ గతంలో ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ తన విధుల్లో భాగంగా ఆ ఆదేశాలను పాటిస్తూ ఇటీవల ఇల్లందులో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రుల ఫ్లెక్సీలు తొలగించారని చెప్పారు. దీనికి రెచ్చిపోయిన టీఆర్‌ఎస్ నాయకులు కమిషనర్ ఇంటికి వెళ్లి మరీ దాడికి దిగారని తెలిపారు. ఇలా అధికారులపై దాడులు జరిగితే మానసిక స్థైర్యాన్ని కోల్పోతారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు.