న్యూడెమోక్రసీ నాయకుడు ధనసరి సమ్మయ్య అలియాస్ గోపి
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : న్యూడెమోక్రసీ వరంగల్ జిల్లా నాయకుడు ధనసరి సమ్మయ్య అలియాస్ గోపిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 31న గుండాల మండలం రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్ట మీద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లింగన్న మృతి చెందగా గోపి తప్పించుకున్నాడు. ఐదు రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్న గోపిని వరంగల్ సమీపంలోని ఆరెపల్లి వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు న్యూడెమోక్రసీ వర్గాలు తెలిపాయి. గోపి పోలీసులకు చిక్కడం ఇదో రెండోసారి. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న ధనసరి సమ్మయ్య(గోపి) 2018 నవంబర్ 30న మహబూబాబాద్‌లో ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వలపన్నారు. తప్పించుకుని ఆటోలో వెళ్తుండగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. విడుదలయ్యాక కొంతకాలం సాధారణ జీవితం గడిపి నాలుగు నెలల క్రితమే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. గోపిని వెంటనే మీడియా ముందు హాజరుపర్చాలని ఎన్డీ జిల్లా నాయకులు చండ్ర అరుణ, జడ సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణరావు విడుదల చేసిన ప్రకటనలో గోపిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment