కళహసీబస్తీలోని రేషన్ దుకాణంలో నిల్వ ఉంచిన బియ్యం
సాక్షి, ఇల్లెందు అర్బన్: పట్టణం, మండలంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల కోత ఉంటోంది. దీంతో డీలర్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌకధర బియ్యం ప్రతీ సంచిలో 50 కేజీలు ఉండాల్సి ఉండగా రేషన్ దుకాణానికి వచ్చే సరికి 43 నుంచి 47కిలోలు మాత్రమే ఉంటోంది.
ప్రతీ సంచిలో ఐదారు కిలోల దాక కోత ఉంటుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో 38 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. 60వేలకు పైగా ఆహరభద్రత కార్డులు ఉన్నాయి. దాదాపు 4012 క్వింటాళ్ల బియ్యం ఇల్లెందుకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలతో అర్హులైన లబ్దిదారులకు ఎక్కడి నుంచైనా బియ్యం పొందే వెసులుబాటు ఏర్పడింది.
ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనంతరం మిగిలిన స్టాక్ అంతా రాష్ట్ర ఉన్నతాధికారులకు సైతం తెలియజేసేలా ఆన్‌లైన్‌లో నమోదవుతోంది. దీంతో అక్రమాలు జరిగే ప్రసక్తే ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా డీలర్లు బియ్యం కోసం కట్టిన డీడీకి తగినన్ని బియ్యం సరఫరా కావడంలేదు. దీంతో ప్రతి నెల డీలర్లు సొంత ఖర్చుతో 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకొని ప్రజలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నిబంధనలు బేఖాతరు
జిల్లా నుంచి పట్టణంలోని జీసీసీ గోదాముకు వచ్చిన బియ్యాన్ని నిల్వ అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు తూకం వేసి పంపాల్సి ఉంది. కానీ సరాసరి లారీలో నుంచి తిరిగి లారీలోకి తరలించడం, ప్రతీ సంచిలో రంధ్రాల నుంచి బియ్యం పడిపోవడం జరుగుతోంది. దీంతో పాటు గోదాంలకు సరఫరా అయ్యే సమయంలో బియ్యం తూకం వేయకపోవడంతో అవకతవకలకు తావిచ్చినట్టైంది. ఫలితంగా తక్కువ పడిన బియిన్ని భర్తీ చేస్తూ... డీలర్లు నష్టపోతున్నారు.
నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది..
రేషన్ దుకాణానికి వచ్చే బియ్యం సంచుల్లో కోత ఉంటోంది. ప్రతీ సంచిలో నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయి. అలా చేయకపోవడంతో తూకం తక్కువగా ఉండి డీలర్లు నష్టపోవాల్సి వస్తోంది
-స్వరూప, డీలర్
అధికారులు పట్టించుకోవడంలేదు..
గత కొంత కాలం నుంచి మాకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో తూకం తేడాలు ఉంటున్నాయి. సంచుల్లో తక్కువగా బియ్యం వస్తోందని అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంచుల్లో తక్కువగా బియ్యం రావడంతో మేమే స్వయంగా ప్రతి నెలా రెండు, మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సి వస్తోంది.
-కటకం పద్మావతి, డీలర్
Comments
Please login to add a commentAdd a comment