Ration supplies
-
రేషన్ బియ్యం ఇక పూర్తి ఉచితం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రేషన్ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకూ కిలోకి రూపాయి తీసుకునేవారు. ఇక నుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్న సర్కారు నూతన సంవత్సరం నుంచి జిల్లాలో ఉచిత రేషన్ అమలు చేయనుంది. ప్రతి నెల 16,474 మెట్రిక్ టన్నులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని అందిస్తూ కిలో ఒక్క రూపాయికే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక నుంచి నూతన సంవత్సరంలో సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ వాహనాలు ద్వారా అందించే పంచదార, కందిపప్పుకు మాత్రమే డబ్బులు తీసుకోనున్నారు. కేజీ కందిపప్పుకు రూ.67, అరకిలో పంచదారకు రూ.17 తీసుకోవాలని, బియ్యం మాత్రం ఉచితంగానే అందించాలని ఆదేశించింది. ఈఏఏవై కార్డుదారులకు కేజీ పంచదార రూ.13.50కే అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన సంవత్సర కానుకగా.. నూతన సంవత్సర కానుకగా అందించే ఈ బియ్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లాలో 6,42,526 కార్డులకు గాను 17,87,981 మందికి అందిస్తారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 5,36,423 కార్డులకు గాను 15,06,921 మంది ప్రజలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,474 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఉచితంగా ఆయా కార్డుదారులకు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1,164 రేషన్ దుకాణాల ద్వారా 408 రేషన్ వాహనాలు, అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 1011 రేషన్ దుకాణాల ద్వారా 343 రేషన్ వాహనాలు కార్డుదారుల ఇంటి వద్దకే బియ్యాన్ని తీసుకువెళ్ళి ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పేద ప్రజల్లో ఆనందం ప్రభుత్వం ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేయడంతో పాటు నూతనంగా అందించే రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందించడం పట్ల పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమపై భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ వరుసలో నిలబడి రేషన్ డీలర్ ఇచ్చే బియ్యం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం తమకు ఆ బాధలు తప్పాయంటున్నారు. ఇంటికి తీసుకువచ్చి అందించే బియ్యాన్ని సైతం ఉచితంగా ఇవ్వడం పట్ల కార్డుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఉచితంగా అందిస్తాం ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులకు బియ్యం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర సరుకులకు సొమ్ములు చెల్లించాలి. ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. మిగిలిన సరుకులకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. – పీ.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్, ఏలూరు జిల్లా ఇప్పటికే వాహనాల ద్వారా సరఫరా ఇప్పటికే రేషన్ దుకాణాల నుంచి వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్ళి రేషన్ అందిస్తున్నాం. ఈ నేపధ్యంలో నూతనంగా ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంవత్సరం పాటు ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ సాగుతుంది. – ఈ.మురళీ, జాయింట్ కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా -
సబ్సిడీ కోత.. డీలర్లు డీలా
సాక్షి, ఇల్లెందు అర్బన్: పట్టణం, మండలంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల కోత ఉంటోంది. దీంతో డీలర్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌకధర బియ్యం ప్రతీ సంచిలో 50 కేజీలు ఉండాల్సి ఉండగా రేషన్ దుకాణానికి వచ్చే సరికి 43 నుంచి 47కిలోలు మాత్రమే ఉంటోంది. ప్రతీ సంచిలో ఐదారు కిలోల దాక కోత ఉంటుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో 38 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. 60వేలకు పైగా ఆహరభద్రత కార్డులు ఉన్నాయి. దాదాపు 4012 క్వింటాళ్ల బియ్యం ఇల్లెందుకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలతో అర్హులైన లబ్దిదారులకు ఎక్కడి నుంచైనా బియ్యం పొందే వెసులుబాటు ఏర్పడింది. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనంతరం మిగిలిన స్టాక్ అంతా రాష్ట్ర ఉన్నతాధికారులకు సైతం తెలియజేసేలా ఆన్లైన్లో నమోదవుతోంది. దీంతో అక్రమాలు జరిగే ప్రసక్తే ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా డీలర్లు బియ్యం కోసం కట్టిన డీడీకి తగినన్ని బియ్యం సరఫరా కావడంలేదు. దీంతో ప్రతి నెల డీలర్లు సొంత ఖర్చుతో 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకొని ప్రజలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలు బేఖాతరు జిల్లా నుంచి పట్టణంలోని జీసీసీ గోదాముకు వచ్చిన బియ్యాన్ని నిల్వ అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు తూకం వేసి పంపాల్సి ఉంది. కానీ సరాసరి లారీలో నుంచి తిరిగి లారీలోకి తరలించడం, ప్రతీ సంచిలో రంధ్రాల నుంచి బియ్యం పడిపోవడం జరుగుతోంది. దీంతో పాటు గోదాంలకు సరఫరా అయ్యే సమయంలో బియ్యం తూకం వేయకపోవడంతో అవకతవకలకు తావిచ్చినట్టైంది. ఫలితంగా తక్కువ పడిన బియిన్ని భర్తీ చేస్తూ... డీలర్లు నష్టపోతున్నారు. నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది.. రేషన్ దుకాణానికి వచ్చే బియ్యం సంచుల్లో కోత ఉంటోంది. ప్రతీ సంచిలో నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయి. అలా చేయకపోవడంతో తూకం తక్కువగా ఉండి డీలర్లు నష్టపోవాల్సి వస్తోంది -స్వరూప, డీలర్ అధికారులు పట్టించుకోవడంలేదు.. గత కొంత కాలం నుంచి మాకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో తూకం తేడాలు ఉంటున్నాయి. సంచుల్లో తక్కువగా బియ్యం వస్తోందని అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంచుల్లో తక్కువగా బియ్యం రావడంతో మేమే స్వయంగా ప్రతి నెలా రెండు, మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. -కటకం పద్మావతి, డీలర్ -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులను కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల పోలీసులు గురువారం పట్టుకున్నారు. ట్రాలీ ఆటోలో రేషన్ సరుకులను తరలిస్తుండగా రేగుంట గ్రామ సమీపంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని, 200 లీటర్ల కిరోసిన్, 16 క్వింటాళ్ల గోధుమలు, నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సరుకులను రాయికల్, మల్లాపూర్ మండలాల్లో అక్రమంగా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు తేలిందని ఎస్సై జానీపాషా తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
పింఛన్లకు ‘డెడ్’లైన్
ఆకివీడు : రేషన్ సరఫరా గడువును కుదించి నట్టే పింఛన్ల పంపిణీనీ మూడురోజులకు పరిమితం చేయడంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి మూడోతేదీలోపే పంపిణీని పూర్తిచేయాలని జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ నుంచి ఆదేశాలందాయి. దీంతో ఒకటో తేదీ ఉదయం నుంచే పంపిణీని ప్రారంభించారు. మూడురోజుల్లో తీసుకోకుంటే పింఛన్లు ఇవ్వరనే ఆందోళనతో లబ్ధిదారులు మంగళ, బుధవారాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరారు. పింఛన్లు పంపిణీ చేసే ట్యాబ్‌లు మొరాయించడం, సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలతరబడి పంచాయతీ కార్యాలయాల వద్దే పడిగాపులు పడ్డారు. తలపట్టుకున్న పంపిణీ సిబ్బంది మంగళ, బుధవారాల్లో తెల్లవారుజామునే లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయాల వద్దకు చేరుకోవడంతో సిబ్బంది ఉదయం ఏడు గంటలకే పంపిణీని ప్రారంభించారు. కొద్ది నిమిషాలకే సర్వర్ మొరాయించడం, వేలిముద్రల సేకరణ కష్టంగా మారడంతో సిబ్బంది ట్యాబ్‌లతో కుస్తీపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. గంటకు పాతిక పింఛన్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. దీంతో వృద్ధులు, వికలాంగులు నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లబ్ధిదారులు ఇళ్లకు కూడా వెళ్లకుండా తిండీతిప్పలు లేకుండా పంచాయతీ కార్యాలయాల వద్దే ఆపసోపాలు పడ్డారు. కొన్నిచోట్ల వృద్ధులు ఎక్కువసేపు నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయారు. ఓ వైపు సర్వర్ పనిచేయక, మరో వైపు లబ్ధిదారుల అవస్థలు చూడలేక పంపిణీ సిబ్బంది తలలు పట్టుకున్నారు. మూడోతేదీ దాటితే పింఛన్ అందనట్టేనా! గతంలో ప్రతినెలా పదో తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేసేవారు. ఆ తేదీకి తీసుకోని వారికి ఆ తరువాత నెలలో పింఛన్ ఇచ్చేవారు. అయితే ఈనెల నుంచి గడువులోపు పింఛన్లు తీసుకోకుంటే తరువాతినెలలో ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇది లబ్ధిదారుల్లో ఆందోళనరేపుతోంది. గత నెలలో ఐదు శాతం అంటే సుమారు 16 వేల మంది ఫించన్ పొందలేదు. వీరికి ఈనెలలో ఇస్తారు. నిబంధనల ప్రకారం.. మూడు నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోతే ఆ లబ్ధిదారుని జాబితా నుంచి తొలగిస్తారు. తరువాత లబ్ధిదారులు స్థానికంగానే ఉన్నానని ధ్రువపత్రాలు దాఖలు చేస్తే పింఛన్ పునరుద్ధరించాలి. రెండేళ్ల నుంచీ తిప్పలే పింఛన్ల కోసం రెండేళ్ల నుంచి తిప్పలు పడుతూనే ఉన్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రలు సరిగా పడకపోవడంతో పంపిణీ కేంద్రాలకు తరుచూ తిరగాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా, పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు ఇస్తామన్నారని, ఇప్పుడు పంచాయతీ కార్యాలయాల వద్ద ఇస్తున్నారని ప్రభుత్వం నెలకో విధానాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులను అవస్థలకు గురిచేస్తోందని ఆవేదన చెందారు. సగం మందికే పంపిణీ జిల్లాలో మొత్తం 3,42,259 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.37.03 కోట్లు అందిస్తున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 1,61,608 మంది ఉండగా, వారికి రూ.16.89కోట్లు, వితంతు పింఛన్‌దారులు 1,05,530 మంది ఉండగా, రూ.11.17కోట్లు, వికలాంగ పింఛన్‌దారులు 44,810 మంది ఉండగా, రూ.6.10కోట్లు, చేనేత కార్మిక పింఛన్‌దారులు 3,275 మంది ఉండగా, రూ.0.34కోట్లు, కల్లుగీత కార్మిక పింఛన్‌దారులు 1974 మంది ఉండగా, రూ.0.20కోట్లు, అభయహస్తం పింఛన్‌దారులు 25,062 మంది ఉండగా, వీరికి రూ.2.60కోట్లు పంపిణీ చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మొత్తం 52 శాతం మందికి మాత్రమే పింఛన్ల పంపిణీ జరిగిది. అంటే 1,77,900 మందికి మాత్రమే పింఛన్ అందింది. ఇంకా సగం మందికి మూడోతేదీ ఒక్కరోజే అందించాల్సి ఉంది. ఇది ఏమాత్రం సాధ్యం కాదని పంపిణీ సిబ్బందే చెబుతున్నారు. -
బినామీలదే రాజ్యం
♦ పశ్చిమ ప్రాంతంలో బినామీ రేషన్ డీలర్ల హవా ♦ పది నెలల్లో 64 మంది రాజీనామా ♦ ప్రభుత్వం మారటంతో అధికారుల ఒత్తిడి మండలాల వారీగా ఖాళీలు అర్ధవీడు 3, బేస్తవారిపేట 1, కంభం 4, గిద్దలూరు 2, కొమరోలు 1, మార్కాపురం 9, పెద్దారవీడు 2, పుల్లలచెరువు 8, త్రిపురాంతకం 17, వైపాలెం 11, దోర్నాలల్లో ఆరు డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజీనామా చేసిన డీలర్లు 90శాతం మంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఒత్తిడులు తట్టుకోలేక డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. వీరిని ఎదిరించిన డీలర్లపై రెవెన్యూ అధికారులు 6ఏ కేసులు, మరీ లొంగకపోతే పోలీసు కేసులు కూడా పెడుతున్నారు. బినామీ డీలర్లు కావటంతో వినియోగదారులకు రేషన్ సరుకులు సక్రమంగా లభించటం లేదు. గత నెలలో రంజాన్ సందర్భంగా చంద్రన్న తోఫాలోని వస్తువుల్లో మార్కాపురం పట్టణంలో పూర్తి స్థాయిలో ముస్లింలకు అందలేదు. మార్కాపురం : పశ్చిమ ప్రకాశంలోని 12 మండలాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్లదే హవాగా మారింది. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటంతో వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న డీలర్లపై టీడీపీ నేతలు అధికారుల ద్వారా ఒత్తిడి చేయించటంతో తట్టుకోలేక పలువురు డీలర్లు రాజీనామా బాట పట్టారు. డివిజన్లో మొత్తం 430 రేషన్ దుకాణాలుండగా, పది నెలల కాలంలో 64 మంది డీలర్లు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేయాల్సిన అధికారులు కాలక్షేపం చేస్తూ పొదుపు సంఘాల పేరుతో టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారు. వారు ఆడిందే ఆట... పాడిందే పాటగా... రేషన్ ఇస్తేనే కార్డుదారులు నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల వేధింపులను ఎదుర్కొన్న వైఎస్సార్ సీపీ మద్దతుదారుల డీలర్లు సుమారు 25మందిపై 6ఏ కేసులు నమోదు చేసి టీడీపీ మద్దతుదారులకు రేషన్‌షాపులను కట్టబెడుతున్నారు. రికార్డుల్లో మాత్రం పొదుపు సంఘాల పేరుతో ఉండగా, నిర్వహించేది మాత్రం టీడీపీ మద్దతుదారులే కావటం గమనార్హం. రాజీనామాల బాటలో... రాజకీయ క్రీనీడలో పలువురు డీలర్లు బలైపోతున్నారు. పెద్దారవీడు మండలంలో బి చెర్లోపల్లె, కలనూతల, పుల్లలచెరువు మండలంలోని అక్కపాలెం, నాయుడుపల్లి, సిద్ధినపాలెం, ఐటీవరం, నరజాముల తండా, మానేపల్లి, సింగుపల్లి, త్రిపురాంతకం మండలంలోని దూపాడు, త్రిపురాంతకం, గణపవరం, జి.ఉమ్మడివరం, ఎండూరివారిపాలెం, రామసముద్రం, కంకణాలపల్లె, సోమేపల్లి, హసనాపురం, వెంగాయపాలెం, మిరియంపల్లి, వెల్లంపల్లి, డీబీఎన్ కాలనీ, జీఎస్ తండాల రేషన్‌షాపుల డీలర్లు రాజీనామా చేశారు. యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి, యర్రగొండపాలెం, గోళ్లవీడిపి, సర్వాయపాలెం, గురిజేపల్లి, కొలుకుల, దోర్నాల మండలంలోని కటకానిపల్లె, చిన్నదోర్నాల, కడపరాజుపల్లి, ఐనముక్కల, నల్లగుంట్ల రేషన్‌షాపుల డీలర్లు కూడా అదే బాట పట్టారు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా రాజీనామాల హడావుడి ఎక్కువగానే ఉంది. ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాత్రిపూట డీలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీల పేరుతో భయపెడుతూ రాజీనామా చేస్తావా... కేసులు నమోదు చేయించమంటావా అంటూ హెచ్చరించటంతో విధిలేని పరిస్థితుల్లో వెనుకడుగేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
సకాలంలో సరుకులు
పేదలకు ప్రతి నెలా 15వ తేదీలోగా రేషన్ సరుకులు అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా రూపొందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి చెప్పారు. మూడు పద్ధతుల ద్వారా చౌకధరల దుకాణాలను పునర్వ్యవస్థీకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు ముగుస్తుందని, దీని ద్వారా ఇప్పుడున్న 1,338 దుకాణాలకు తోడుగా మరికొన్ని పెరగవచ్చన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పకడ్బందీగా ప్రజాపంపిణీ వ్యవస్థ - మూడు పద్ధతులలో దుకాణాల పునర్వ్యవస్థీకరణ - రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 20 వరకు పూర్తి - రేషన్ సరుకులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు - ‘కస్టమ్స్ మిల్లింగ్ రైస్’ పెండింగ్‌పై సీరియస్ - అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగం - జిల్లాకు 45 వేల ‘దీపం’ కనెక్షన్లు మంజూరు - జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్‌కార్డులు, దుకాణాల రేషనలైజేషన్, కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ, రబీ ధాన్యం కొనుగోళ్లు, ‘అకాల’ పంటల నష్టం పై ప్రభుత్వానికి పంపిన తుది నివేదిక తదితర అంశాల గురించి వివరించారు. ఆయన మాటలలోనే... ‘ప్రజాపంపిణీ’లో అక్రమాలు సహించం. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నాం. బోగస్ డీలర్లు, రేషన్ దుకాణాలు, కార్డులపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నాం. ప్రజాపంపిణీ వ్యవస్థలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లపై 6ఎ చట్టం ప్రయోగిస్తాం. రేష న్ సరుకులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే 12 మంది డీలర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అ ందేలా చూస్తాం. ప్రతి నెల 22లోగా, వచ్చే నెల సరుకుల కోసం డీడీలు తీసి సంబంధిత అధికారులకు అందజేయూలి. 23 నుంచి సరుకులు పంపిణీ చేసే నెల ఒకటవ తేదీ వరకు మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి సరుకులు అందుతారు. 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేసి, 16న ముగింపు నిల్వల వివరాలు చూపాలి. -
సేవలు ఇక ఆంధ్రనుంచే !
- రేషన్ సరఫరాకు ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం - డీడీలు చెల్లించాలని డీలర్లకు ఆదేశాలు - పింఛన్ల పంపిణీ అటు నుంచే - ఉద్యోగుల పంపకాలపై కసరత్తు భద్రాచలం : ముంపు మండలాల పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి తమ ఆధీనంలోకి తీసుకుంటామని గెజిట్ జారీ చేసిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, ఇందుకనుగుణంగానే చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లా పాలనలో సాగిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. ముంపు మండలాల్లో పౌరసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన నిత్యావసర సరుకులను తామే సరఫరా చేస్తామని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టరేట్ల నుంచి ఇక్కడి అధికారులకు లేఖ అందింది. సరుకుల సరఫరాకు డీడీలు తీసి తమకు అందజేయాలని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అయిన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, భద్రాచలం రూరల్ మండలాల్లో ఉన్న రేషన్ డీలర్లకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతులు సోమవారం నాలుగు మండలాల రెవెన్యూ అధికారులకు అందాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్, పంచదార, గోదుమలను అందజేసేందుకు సరుకులు కేటాయించారు. భద్రాచలం(నెల్లిపాక) మండలంలో ఉన్న 12,382 రేషన్ కార్డులకు గాను 190.216 మెట్రిక్ టన్నుల బియ్యం, కూనవరంలోని 8057 కార్డులకు 120.049 మెట్రిక్ టన్నులు, వీఆర్‌పురంలోని 7662 కార్డులకు 129.525 మెట్రిక్ టన్నులు, చింతూరు మండలంలోని 11,260 రేషన్‌కార్డులకు 172.015 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ప్రతి రేషన్‌కార్డు దారుడికి ఒక ప్యాకెట్ పంచదార, ఒక ప్యాకెట్ గోధుమలతో పాటు కార్డుల్లో ఉన్న లబ్ధిదారుల సంఖ్యను బట్టి బియ్యం కేటాయించారు. నాలుగు మండలాల్లో మొత్తం 39,361 రేషన్ కార్డులకు ఒక్కో కార్డుకు అరకిలో పంచదార, కిలో గోధుమ ప్యాకెట్లు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పౌర సరఫరాల శాఖ పేరనే డీడీలు చెల్లించాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. చింతూరులో ఉన్న స్టాక్ పాయింట్ నుంచి చింతూరు, వీఆర్ పురం మండలాలకు, భద్రాచలం స్టాక్ పాయింట్ నుంచి కూనవరం, భద్రాచలం మండలాలకు సరుకులు రవాణా చేయాలని భావించారు. అయితే భద్రాచలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై భద్రాచలం ఆర్డీవో అంజయ్య సోమవారం రంపచోడవరం ఆర్డీవోతో చర్చించారు. మంగళవారం నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అక్కడి అధికారులు తెలిపారు. ముంపు మండలాలకు రేషన్ సరుకులను తామే సరఫరా చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంతో ఇక నుంచి అన్ని రకాల పౌరసేవ లు కూడా అటు నుంచే కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది. విలీనమైన మండలాల్లో ఎంత మంది.. ఏఏ రకాల పింఛన్ దారులు ఉన్నారనే దానిపై అక్కడి అధికారులు లెక్కలు వేస్తున్నారు. నేడో, రేపో దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల పంపకాలపై కసరత్తు... ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల పంపకాలపై కసరత్తు మొదలైంది. ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే విషయమై ఇప్పటికే అంగీకార(ఆప్షన్) పత్రాలు తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మన కలెక్టర్ ఇలంబరితి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు మంగళవారం సమావేశమవుతున్న నేపథ్యంలో ముంపు ఉద్యోగుల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. అన్ని శాఖల్లో 80 శాతం మంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చేందుకు మొగ్గు చూపుతూ ఆప్షన్లు ఇచ్చారు. వారంతా ఎప్పుడు వెనక్కు వస్తామా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా శాఖల వారీగా ఉద్యోగుల సర్దుబాట్లుకు కౌన్సెలింగ్ ఉంటుందనే ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై ఇప్పటి వరకూ జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవటంతో ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఏది ఏమైనా ముంపులో పనిచేస్తున్న తమకు సెప్టెంబర్ వేతనాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండటంతో ఈ నెలలోనే పంపకాల ప్రక్రియ పూర్తి అవుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
‘బోగస్’ రట్టు!
- రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డులు : 10.87 లక్షలు - ఇప్పటివరకు గుర్తించిన బోగస్ కార్డులు : 1.31లక్షలు - ‘బోగస్’లకు రేషన్ సరుకుల నిలిపివేత బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ అంతా ఆధార్ కార్డుల ఆధారంగానే కొనసాగుతోంది. రేషన్ కార్డులను ఆధార్ కార్డుల వివరాలతో అనుసంధానం(సీడింగ్) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్నప్పటికీ నత్తనడకన సాగుతోంది. అయితే వాస్తవ లబ్ధిదారులు కొందరు సీడింగ్ చేయించనప్పటికీ.. బోగస్‌ల వివరాలు సైతం సీడింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బోగస్ కార్డులను ఏరివేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించిన నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన అధికారులు ఇప్పటివరకు 1.31లక్షల కార్డులను బోగస్ కార్డులుగా తేల్చారు. రేషన్ కా ర్డులోని సభ్యుల పేర్లలో ఒక్కరు కూ డా ఆధార్‌తో అనుసంధానం చేయిం చకుంటే వాటిని బోగస్‌గా గుర్తిం చినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని సంక్షేమ పథకాలకు ఇకపై రేషన్ కార్డు కీలకం కానుంది. వీటి ఆధారంగానే అర్హులను ధ్రువీకరించనున్నారు. ఇంతటి కీలకమైన రేషన్ కార్డులు అధిక మొత్తంలో అనర్హుల చేతిలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 1.31లక్షల కార్డులు బోగస్‌గా గుర్తించినప్పటికీ.. రేషన్ సరఫరాకు సంబంధించి కీ రిజిస్టర్లలో వారి పేర్లున్నాయి. అయితే బోగస్‌గా గుర్తించిన కార్డులన్నింటికీ రేషన్ సరుకులు కోత పెట్టాలని, వచ్చే నెలలో రూపొందించే కీ రిజిస్టర్లలో బోగస్ కార్డుల వివరాలు తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే బోగస్‌గా గుర్తించిన రేషన్ కార్డు దారులు ఆధార్ వివరాలు సమర్పిస్తే తిరిగి అర్హత ఇస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.