బినామీలదే రాజ్యం | Kingdom of binamies | Sakshi
Sakshi News home page

బినామీలదే రాజ్యం

Published Fri, Aug 21 2015 2:50 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

బినామీలదే రాజ్యం - Sakshi

బినామీలదే రాజ్యం

♦ పశ్చిమ ప్రాంతంలో బినామీ రేషన్ డీలర్ల హవా
♦ పది నెలల్లో 64 మంది రాజీనామా
♦ ప్రభుత్వం మారటంతో అధికారుల ఒత్తిడి
 
 మండలాల వారీగా ఖాళీలు 
అర్ధవీడు 3, బేస్తవారిపేట 1, కంభం 4, గిద్దలూరు 2, కొమరోలు 1, మార్కాపురం 9, పెద్దారవీడు 2, పుల్లలచెరువు 8, త్రిపురాంతకం 17, వైపాలెం 11, దోర్నాలల్లో ఆరు డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజీనామా చేసిన డీలర్లు 90శాతం మంది విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఒత్తిడులు తట్టుకోలేక డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. వీరిని ఎదిరించిన డీలర్లపై రెవెన్యూ అధికారులు 6ఏ కేసులు, మరీ లొంగకపోతే పోలీసు కేసులు కూడా పెడుతున్నారు. బినామీ డీలర్లు కావటంతో వినియోగదారులకు రేషన్ సరుకులు సక్రమంగా లభించటం లేదు. గత నెలలో రంజాన్ సందర్భంగా చంద్రన్న తోఫాలోని వస్తువుల్లో మార్కాపురం పట్టణంలో పూర్తి స్థాయిలో ముస్లింలకు అందలేదు.  
 
 మార్కాపురం : పశ్చిమ ప్రకాశంలోని 12 మండలాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్లదే హవాగా మారింది. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటంతో వైఎస్‌ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న డీలర్లపై టీడీపీ నేతలు అధికారుల ద్వారా ఒత్తిడి చేయించటంతో తట్టుకోలేక పలువురు డీలర్లు రాజీనామా బాట పట్టారు. డివిజన్‌లో మొత్తం 430 రేషన్ దుకాణాలుండగా, పది నెలల కాలంలో 64 మంది డీలర్లు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేయాల్సిన అధికారులు కాలక్షేపం చేస్తూ పొదుపు సంఘాల పేరుతో టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారు.

వారు ఆడిందే ఆట... పాడిందే పాటగా... రేషన్ ఇస్తేనే కార్డుదారులు నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల వేధింపులను ఎదుర్కొన్న వైఎస్సార్ సీపీ మద్దతుదారుల డీలర్లు సుమారు 25మందిపై 6ఏ కేసులు నమోదు చేసి టీడీపీ మద్దతుదారులకు రేషన్‌షాపులను  కట్టబెడుతున్నారు. రికార్డుల్లో మాత్రం పొదుపు సంఘాల పేరుతో ఉండగా, నిర్వహించేది మాత్రం టీడీపీ మద్దతుదారులే కావటం గమనార్హం.

 రాజీనామాల బాటలో...
 రాజకీయ క్రీనీడలో పలువురు డీలర్లు బలైపోతున్నారు. పెద్దారవీడు మండలంలో బి చెర్లోపల్లె, కలనూతల, పుల్లలచెరువు మండలంలోని అక్కపాలెం, నాయుడుపల్లి, సిద్ధినపాలెం, ఐటీవరం, నరజాముల తండా, మానేపల్లి, సింగుపల్లి, త్రిపురాంతకం మండలంలోని దూపాడు, త్రిపురాంతకం, గణపవరం, జి.ఉమ్మడివరం, ఎండూరివారిపాలెం, రామసముద్రం, కంకణాలపల్లె, సోమేపల్లి, హసనాపురం, వెంగాయపాలెం, మిరియంపల్లి, వెల్లంపల్లి, డీబీఎన్ కాలనీ, జీఎస్ తండాల రేషన్‌షాపుల డీలర్లు రాజీనామా చేశారు.

యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి, యర్రగొండపాలెం, గోళ్లవీడిపి, సర్వాయపాలెం, గురిజేపల్లి, కొలుకుల, దోర్నాల మండలంలోని కటకానిపల్లె, చిన్నదోర్నాల, కడపరాజుపల్లి, ఐనముక్కల, నల్లగుంట్ల రేషన్‌షాపుల డీలర్లు కూడా అదే బాట పట్టారు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా రాజీనామాల హడావుడి ఎక్కువగానే ఉంది. ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాత్రిపూట డీలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీల పేరుతో భయపెడుతూ రాజీనామా చేస్తావా... కేసులు నమోదు చేయించమంటావా అంటూ హెచ్చరించటంతో విధిలేని పరిస్థితుల్లో వెనుకడుగేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement