‘బోగస్’ రట్టు!
- రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డులు : 10.87 లక్షలు
- ఇప్పటివరకు గుర్తించిన బోగస్ కార్డులు : 1.31లక్షలు
- ‘బోగస్’లకు రేషన్ సరుకుల నిలిపివేత
బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ అంతా ఆధార్ కార్డుల ఆధారంగానే కొనసాగుతోంది. రేషన్ కార్డులను ఆధార్ కార్డుల వివరాలతో అనుసంధానం(సీడింగ్) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్నప్పటికీ నత్తనడకన సాగుతోంది. అయితే వాస్తవ లబ్ధిదారులు కొందరు సీడింగ్ చేయించనప్పటికీ.. బోగస్‌ల వివరాలు సైతం సీడింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.
తాజాగా ప్రభుత్వం ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బోగస్ కార్డులను ఏరివేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించిన నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన అధికారులు ఇప్పటివరకు 1.31లక్షల కార్డులను బోగస్ కార్డులుగా తేల్చారు. రేషన్ కా ర్డులోని సభ్యుల పేర్లలో ఒక్కరు కూ డా ఆధార్‌తో అనుసంధానం చేయిం చకుంటే వాటిని బోగస్‌గా గుర్తిం చినట్లు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని సంక్షేమ పథకాలకు ఇకపై రేషన్ కార్డు కీలకం కానుంది. వీటి ఆధారంగానే అర్హులను ధ్రువీకరించనున్నారు. ఇంతటి కీలకమైన రేషన్ కార్డులు అధిక మొత్తంలో అనర్హుల చేతిలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు 1.31లక్షల కార్డులు బోగస్‌గా గుర్తించినప్పటికీ.. రేషన్ సరఫరాకు సంబంధించి కీ రిజిస్టర్లలో వారి పేర్లున్నాయి. అయితే బోగస్‌గా గుర్తించిన కార్డులన్నింటికీ రేషన్ సరుకులు కోత పెట్టాలని, వచ్చే నెలలో రూపొందించే కీ రిజిస్టర్లలో బోగస్ కార్డుల వివరాలు తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే బోగస్‌గా గుర్తించిన రేషన్ కార్డు దారులు ఆధార్ వివరాలు సమర్పిస్తే తిరిగి అర్హత ఇస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.