సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో మూడేళ్లలో దాదాపు మూడు లక్షల ఆహార భద్రత కార్డులు రద్దయ్యాయి. బోగస్, అనర్హుల ఏరివేతలో భాగంగా అధికారులు అర్హుల కార్డులనూ తొలగించారు. ఆధార్ అనుసంధానంతో కొన్ని కార్డులు రద్దు కాగా... జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, ఆదాయ, ఇతరాత్ర పన్నుల పరిధిలోకి వచ్చిన కుటుంబాల కార్డులు రద్దయ్యాయి. అప్పట్లో వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోని కార్డులు సైతం తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది ఈ–పాస్ యంత్రాల విస్తరణ కార్య క్రమం కొనసాగడంతో ఆ ఏడాది మార్చి వరకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆన్‌లైన్ వెబ్‌సైట్ నిలిచిపో యింది. దీంతో కార్డుల్లో మార్పుచేర్పులు, పునరుద్ధరణ లేకుండా పోయింది. ఆ తర్వాత వెబ్ సైట్ ప్రారంభమైనా కార్డుల పునరుద్ధరణ, యూనిట్లలో మార్పుచేర్పులు ఆలస్యంగా జరుగు తున్నాయి. రద్దయిన అర్హుల కార్డులను తిరిగి పునరుద్ధరించకపోవడంతో పేదలు పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇదీ పరిస్థితి...
పేదలు దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యంగా వెంటనే ఆహార భద్రత కార్డులను మంజూరు చేసిన పౌరసరఫరాల శాఖ... ఆ తర్వాత దశల వారీగా వాటిని ఏరివేస్తూ వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అధికారంలో వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డులను రద్దు చేసింది. ఆహార భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. నగరవాసులతో పాటు వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన పేదలు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ వద్ద సిబ్బంది కొరతతో క్షేత్రస్థాయి విచారణ లేకుండానే కేవలం ఆధార్ కార్డులను పరిగణలోకి తీసుకొని ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. దీంతో బోగస్, డబుల్, ఇతర రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు సైతం మంజూరు కావడంతో కార్డుల సంఖ్య ఒకేసారి పైకి ఎగబాకింది. ఆ తర్వాత ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధార్ నంబర్లను ఎన్‌ఐసీతో అనుసంధానం చేయడంతో బోగస్, డబుల్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు ఉన్నవారిని గుర్తించింది. ఆయా కార్డులతో పాటు కోటా రద్దు చేసింది. కార్డుల ఏరివేతలో అనర్హులతో పాటు అర్హుల కార్డులూ రద్దయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పౌరసరఫరాల పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అర్బన్ పరిధులున్నాయి. మొత్తం 12 సివిల్ సప్లయిస్ సర్కిల్స్ ఉండగా అందులో హైదరాబాద్ పరిధిలో తొమ్మిది, మేడ్చల్ అర్బన్‌లో రెండు సర్కిల్స్, రంగారెడ్డి అర్బన్ పరిధిలో ఒక సర్కిల్ ఉన్నాయి. మొత్తం మీద ఆహార భద్రత కార్డుల సంఖ్య సరిగ్గా మూడేళ్ల క్రితం వరకు 14.04 లక్షలు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 11.09 లక్షలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment