భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అడవిరామారంలో గురువారం ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో అధికారులు, గ్రామస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లతో పాటు వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పోటెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్థానికులకు అభయహస్తం దరఖాస్తులను పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాజేంద్రనగర్‌లో, పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందోల్, సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. చాలాచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు దరఖాస్తుల పంపిణీ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలు యూనిట్‌గా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని, నోడల్ అధికారులుగా నియమితులైన సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మరికొందరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్‌పూర్ వెళ్లడంతో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరుకాలేదు.
జిరాక్స్, ఆధార్ సెంటర్లు కిటకిట
ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూతతో పాటు రేషన్‌కార్డులకు కూడా దరఖాస్తులను స్వీకరిస్తారనే ప్రచారంతో తొలిరోజు ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ సభలు, మునిసిపాలిటీల్లోని వార్డు సభలకు వివిధ శాఖల ఉద్యోగులు హాజరై దరఖాస్తులు పంపిణీ చేశారు. అయితే చాలాచోట్ల ప్రజలకు దరఖాస్తులు అందలేదు.
ఇదే అదనుగా దళారులు రంగంలోకి దిగి ఒక్కో దరఖాస్తుకు రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. చాలామంది జిరాక్స్ దరఖాస్తులలో వివరాలు నింపి ఇస్తే తొలుత వాటిని అంగీకరించలేదు. కానీ తర్వాత స్వీకరించారు. దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుల జిరాక్స్‌లను కూడా అటాచ్ చేయాల్సి ఉండడంతో ప్రజలు జిరాక్స్, ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరారు. గురువారం సాయంత్రం వరకు ఈ కేంద్రాలు రద్దీగా కన్పించాయి.
మీ సేవా కేంద్రం నిర్వాహకుడిపై కేసు
► ప్రజాపాలన దరఖాస్తులను రూ.20కి విక్రయిస్తున్న పటాన్‌చెరులోని గణేష్ మీ సేవా కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు నవీందర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాదిలో దరఖాస్తుదారులకు అవసరమైన అప్లికేషన్లు లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని జిరాక్స్ సెంటర్లలో రూ.20 నుంచి రూ.30కి ఒకటి చొప్పున దరఖాస్తులను విక్రయించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో దరఖాస్తుల కోసం గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
అధికారుల పరిశీలన
► నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ హరిత ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తండా, డిచ్‌పల్లి మండలం వెస్లీనగర్ తండా, మాధవనగర్ తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగర శివారులోని మాధవనగర్, మోపాల్ మండలం తాడెం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సభలను సందర్శించారు.
కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్ ఒక్కరే ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామాల్లో కలిపి తొలిరోజు 210 వార్డు, గ్రామ సభలు జరిగాయి. కాగా రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 2,358 వార్డులలో ప్రజాపాలన కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు.
దరఖాస్తులు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎస్
► తొలిరోజు ప్రజాపాలనపై సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్, సందీప్ సుల్తానియాలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించినట్లు సీఎస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711, జీహెచ్‌ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల నుండి 4,57,703 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో సరిపడా అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని ఆదేశించారు.
ఎవరైనా ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీటి వసతి కల్పించాలని, క్యూ లైన్లు పాటించేలా చూడాలని సూచించారు. ప్రతి వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇవ్వాలని ఆదేశించారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్‌్కలను ఏర్పాటు చేయాలన్నారు.
ఉచిత ప్రయాణ సౌకర్యంపై స్పందించని మహిళలు
వట్‌పల్లి (అందోల్): ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందుతున్న మహిళలు..దానిపై సరైన విధంగా స్పందించక పోవడంపై రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని సంగుపేటలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.
‘మీరు బస్సుల్లో తిరుగుతున్నారా? అని ప్రశ్నించగా.. వారు స్పందించలేదు. దీంతో అధికారులు మీరు బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు కదా.. అన్నప్పటికీ కొందరు మహిళలు మాత్రమే చేతులు పైకి లేపారు. దీంతో ఎంత అన్యాయం.. పథకం లబ్దిపొందుతూ స్పందించరా? అని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా బస్సులు మహిళలతోనే నిండిపోతున్నాయని, మగవారికి సీట్లు దొరకడం లేదని కొందరు అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
సెల్‌ఫోన్ వెలుగులో దరఖాస్తుల స్వీకరణ
జ్యోతినగర్ (రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్‌లో దరఖాస్తులు అధికంగా రావడంతో రాత్రి వేళ కూడా స్వీకరించాల్సి వచ్చింది. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో విద్యుత్ దీపాలు లేకపోవడంతో సెల్‌ఫోన్ వెలుగులో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment