- రేషన్ సరఫరాకు ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం
- డీడీలు చెల్లించాలని డీలర్‌లకు ఆదేశాలు
- పింఛన్‌ల పంపిణీ అటు నుంచే
- ఉద్యోగుల పంపకాలపై కసరత్తు
భద్రాచలం : ముంపు మండలాల పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి తమ ఆధీనంలోకి తీసుకుంటామని గెజిట్ జారీ చేసిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, ఇందుకనుగుణంగానే చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లా పాలనలో సాగిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. ముంపు మండలాల్లో పౌరసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన నిత్యావసర సరుకులను తామే సరఫరా చేస్తామని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టరేట్‌ల నుంచి ఇక్కడి అధికారులకు లేఖ అందింది.
సరుకుల సరఫరాకు డీడీలు తీసి తమకు అందజేయాలని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అయిన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, భద్రాచలం రూరల్ మండలాల్లో ఉన్న రేషన్ డీలర్‌లకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతులు సోమవారం నాలుగు మండలాల రెవెన్యూ అధికారులకు అందాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్, పంచదార, గోదుమలను అందజేసేందుకు సరుకులు కేటాయించారు. భద్రాచలం(నెల్లిపాక) మండలంలో ఉన్న 12,382 రేషన్ కార్డులకు గాను 190.216 మెట్రిక్ టన్నుల బియ్యం, కూనవరంలోని 8057 కార్డులకు 120.049 మెట్రిక్ టన్నులు, వీఆర్‌పురంలోని 7662 కార్డులకు 129.525 మెట్రిక్ టన్నులు, చింతూరు మండలంలోని 11,260 రేషన్‌కార్డులకు 172.015 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు.
ప్రతి రేషన్‌కార్డు దారుడికి ఒక ప్యాకెట్ పంచదార, ఒక ప్యాకెట్ గోధుమలతో పాటు కార్డుల్లో ఉన్న లబ్ధిదారుల సంఖ్యను బట్టి బియ్యం కేటాయించారు. నాలుగు మండలాల్లో మొత్తం 39,361 రేషన్ కార్డులకు ఒక్కో కార్డుకు అరకిలో పంచదార, కిలో గోధుమ ప్యాకెట్‌లు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పౌర సరఫరాల శాఖ పేరనే డీడీలు చెల్లించాలని రేషన్ డీలర్‌లను ఆదేశించారు. చింతూరులో ఉన్న స్టాక్ పాయింట్ నుంచి చింతూరు, వీఆర్ పురం మండలాలకు, భద్రాచలం స్టాక్ పాయింట్ నుంచి కూనవరం, భద్రాచలం మండలాలకు సరుకులు రవాణా చేయాలని భావించారు. అయితే భద్రాచలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై భద్రాచలం ఆర్‌డీవో అంజయ్య సోమవారం రంపచోడవరం ఆర్‌డీవోతో చర్చించారు. మంగళవారం నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అక్కడి అధికారులు తెలిపారు.
ముంపు మండలాలకు రేషన్ సరుకులను తామే సరఫరా చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంతో ఇక నుంచి అన్ని రకాల పౌరసేవ లు కూడా అటు నుంచే కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్‌లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది. విలీనమైన మండలాల్లో ఎంత మంది.. ఏఏ రకాల పింఛన్ దారులు ఉన్నారనే దానిపై అక్కడి అధికారులు లెక్కలు వేస్తున్నారు. నేడో, రేపో దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
ఉద్యోగుల పంపకాలపై కసరత్తు...
ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల పంపకాలపై కసరత్తు మొదలైంది. ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే విషయమై ఇప్పటికే అంగీకార(ఆప్షన్) పత్రాలు తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్‌లతో మన కలెక్టర్ ఇలంబరితి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు మంగళవారం సమావేశమవుతున్న నేపథ్యంలో ముంపు ఉద్యోగుల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. అన్ని శాఖల్లో 80 శాతం మంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చేందుకు మొగ్గు చూపుతూ ఆప్షన్‌లు ఇచ్చారు.
వారంతా ఎప్పుడు వెనక్కు వస్తామా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా శాఖల వారీగా ఉద్యోగుల సర్దుబాట్లుకు కౌన్సెలింగ్ ఉంటుందనే ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై ఇప్పటి వరకూ జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవటంతో ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఏది ఏమైనా ముంపులో పనిచేస్తున్న తమకు సెప్టెంబర్ వేతనాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండటంతో ఈ నెలలోనే పంపకాల ప్రక్రియ పూర్తి అవుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సేవలు ఇక ఆంధ్రనుంచే !
Published Tue, Sep 2 2014 4:24 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement
Advertisement