ఇల్లందులో ఉద్రిక్తత
ఇల్లందు (ఖమ్మం) : ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలటీ కేంద్రంలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలోని పాత కూరగాయల మార్కెట్ స్థానంలో నూతన మార్కెట్ నిర్మించడం కోసం ప్రభుత్వం నుంచి రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు గురువారం పాత దుకాణాలను తొలగించేందుకు ప్రయత్నించారు. కాగా ఎప్పటి నుంచో అక్కడే నివాసముంటూ, వ్యాపారాలు చేస్తున్నవారు ఈ దుకాణాల తొలగింపును అడ్డుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా, సమయం కూడా ఇవ్వకుండా దుకాణాలు తొలగిస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మేం ఎన్నోసార్లు దుకాణాలు తొలగిస్తామని దుకాణదారులకు చెప్పామని తెలిపారు. దుకాణాల తొలగింపును నిరసనగా ఒక మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు మహిళను అడ్డుకొని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా మార్కెట్‌లోని మిగిలిన వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.