ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు మండలంలోని రొంపేడు పంచాయతీ మామిడిగుండాల వద్ద డోలమైట్ మైన్ లీజ్ కోసం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. మైనింగ్‌కు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం పరస్పరదాడులకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నం మామిడిగుండాల గ్రామంలో గ్రామ సర్పంచ్ సూర్ణపాక పార్వతి అధ్యక్షతన మైనింగ్ లీజు గ్రామ సభ ఏర్పాటు చేశారు. సర్వేనంబర్ 130/2/ఏలోని 4-80 హెక్టార్లలో డోలమైట్ వెలికి తీసేందుకు 2013 ఫిబ్రవరి 15వ తేదీన గుగులోత్ సోములు, గుగులోత్ రాజేశ్వరిలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మైనింగ్ లీజుకు సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పార్వతి, ఎంపీడీఓ నారాయణమ్మ, ఈఓఆర్డీ బాలాజీ, గ్రామ కార్యదర్శి మహేష్‌లు వివరించారు.
ఈ సభలో గ్రామానికి చెంది ముక్తి కృష్ణ తదితరులు జోక్యం చేసుకుని భూమి, యజమాని, పట్టాదారు వివరాలు కావాలని, పిసా చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించాలని కోరారు. రెవెన్యూగ్రామ పరిధిలోని గిరిజనేతరులను గ్రామ సభ నుంచి పంపించాలని అధికారులను కోరారు. ఈ విషయంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ముక్తి కృష్ణ తీవ్రంగా ఆక్షేపించారు. గిరిజన చట్టాలు ఉల్లఘించి 1/70 చట్టం ఉన్నా 2011లో గిరిజనేతరులు పట్టాలు పొందారని మరోమారు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా ఎన్డీ చంద్రన్న వర్గం నేతలు మాజీ ఎంపీపీ ఎదళ్లపల్లి సత్యం, బయ్యారం మండలానికి చెందిన మాజీ సర్పంచ్ సనప పొమ్మయ్య, మోకాళ్ల రమేష్ తదితరులు గ్రామసభలో మాట్లాడుతూ స్థానిక గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చట్టాలను ఉల్లంఘించి మైనింగ్ లీజు పొందేందుకు బినామీలు యత్నిస్తున్నారని, స్థానికేతరులకు పట్టాలు ఇచ్చారని, స్థానిక గిరిజనులకే చెందాల్సిన మైనింగ్‌లను ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కట్టబెడుతున్నారని అన్నారు.
అధికారులు మాత్రం చట్టాలు, పట్టాలు తమకు సంబంధం లేదన్నట్లు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గ్రామ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో మైనింగ్‌కు అనుకూలంగా ఉన్న మామిడి గుండాలకు చెందిన రామకృష్ణ, ప్రభాకర్‌లు జోక్యం చేసుకుని గ్రామసభలో మెజార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని, ఒక్కరి మాటే వినాల్సిన అవసరం లేదని ముక్తి కృష్ణకు అడ్డుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులకు దిగారు. ఈ క్రమంలో సర్పంచ్ పార్వతీ మైనింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్థానికులకు, చుట్టుపక్కల గ్రామాల వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అధికారులు తీర్మానంపై సంతకాలు తీసుకుంటుండగా ఓ యువకుడు వచ్చి ఆ పుస్తకాన్ని చింపేశాడు. దీనిని గుర్తించిన మైనింగ్ అనుకూల వర్గం వారు అతనిని పట్టుకుని చితకబాదారు. పోలీసుల ఎదుటే గ్రామస్తులు బాహాబాహీకి దిగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు వారు యత్నించారు.
ఈ క్రమంలో ముక్తి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు టెంటును తొలిగించి, కుర్చీలు వేసిరి వేశారు. అక్కడి నుంచి వ్యతిరేక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోగా, గ్రామసభకు అనుకూల వర్గం తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేశారు. ఏఎస్సై హఫీజ్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. మైనింగ్ గ్రామ సభకు ప్రజలను తరలించి అనుకూలంగా చేతులెత్తించాలని సూచిస్తూ ఆదివారం రాత్రి తమకు వెయ్యి రూపాయలు ఇచ్చారని మామిడి గుండాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యాతండాకు చెందిన దారావత్ నందీలాల్ వివరించారు. మామిడిగుండాల మైనింగ్ లీజు గ్రామసభ ఏకపక్షంగా నిర్వహించారని, స్థానిక గిరిజనులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులతో తీర్మానం చేయించుకున్నారని తుడుందెబ్బ మండల అధ్యక్షులు ఈసం కృష్ణ ఆరోపించారు. గిరిజన చట్టాలు ఉల్లంఘించి పట్టాలు పొందటం, స్థానిక గిరిజనుల భాగస్వామ్యం లేకుండా స్థానికేతరులకు మైనింగ్ లీజు కట్టబెట్టడం వల్ల గిరిజనుల సంపద తరలిపోతుందని, ఈ విషయంలో అధికారులు పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని ఎన్డీ చంద్రన్న వర్గం లీగల్ నేతలు ఎదళ్లపల్లి సత్యం, సనప పొమ్మయ్య, మోకాళ్ల రమేష్‌లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గిరిజనుల మధ్య మైనింగ్ చిచ్చు
Published Tue, Oct 29 2013 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement