దసరా వేడుక కోసం జమ్మిగ్రౌండ్‌కు వస్తున్న దేవుడి శావ(ఫైల్)
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దసరా ఉత్సవాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు గుర్తొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ భారీగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా విజయదశమి రోజున జరిగే జమ్మిపూజ, దేవుడి శావ(ఊరేగింపు) చూసేందుకు ఇతర ప్రాంతాల వారు సైతం ఇల్లెందుకు వస్తుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ జరుగుతున్న ఉత్సవాల తీరుతెన్నులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
గోవింద్ సెంటర్ చుట్టూ..
దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బొగ్గుతవ్వకాలు ఇల్లెందులో ప్రారంభమయ్యాయి. బొగ్గు గనుల్లో పని కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. బొగ్గు తవ్వకం, రవాణా ఇతర పనుల పర్యవేక్షణ కోసం బ్రిటిష్ సిబ్బంది, అధికారులు ఇల్లెందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక బొగ్గు గనులకు, బ్రిటీషర్లకు రక్షణగా నాటి సైన్యాన్ని, ఇతర సిబ్బందిని నిజాం రాజు నియమించాడు. అలా ఇల్లెందులపాడు చెరువు నుంచి ప్రస్తుత గోవింద్ సెంటర్ వరకు ఉన్న ప్రదేశంలో స్థానికులు, బ్రిటీషర్లు, నిజాం సేనలు నివసించేవారు.
ఉల్లాసం కోసం భజన బృందాలు
సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆ రోజుల్లో చిన్న చిన్న బావులను తవ్వి బొగ్గు వెలికితీసేవారు. ఆ బావుల చుట్టే కార్మికులు ఇళ్లు నిర్మించుకుని ఉండేవారు. ప్రస్తుతం దో నంబర్ బస్తీగా పిలుస్తున్న ప్రాంతాన్ని అప్పుడు బండమీద బాయిగా పిలిచేవారు. అక్కడ రెండో నంబర్ పేరుతో గని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే కార్మికులు అక్కడే నివసించేవారు. పని ప్రదేశాన్ని మినహాయిస్తే చుట్టూ దట్టమైన అడవిగా ఉండేది. రాత్రివేళ అడవి జంతువుల భయంతో కార్మికులు వణికిపోయేవారు.
అంతేకాదు.. దుర్భరమైన పరిస్థితుల మధ్య ప్రాణా లకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేసేవారు. దీంతో వారికి మానసికోల్లాసం కోసం తొలిసారిగా నంబర్ 2 బస్తీ ఏరియాలోని కార్మికుల కుటుంబాలతో కలిసి శ్రీకృష్ణ భజన బృందం ఏర్పడింది. రాత్రివేళ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఒక చోట చేరి కృష్ణుడి భజన చేసేవారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇల్లెందులోని ఇతర కార్మిక వాడల్లోనూ భజన బృందాలు ఏర్పడ్డాయి. అలా ఇల్లెందులపాడులో హనుమాన్, శ్రీరామ భజన బృందాలు ఏర్పాటయ్యాయి.
ఇల్లెందులో జరిగిన దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు (ఫైల్)
మిషన్ స్కూల్ వద్ద జమ్మిపూజ
ప్రస్తుతం మిషన్ స్కూల్‌గా పిలుస్తున్న ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల వసతిగృహం, మిషన్ హాస్పిటల్ ఉండేవి. ఈ బంగళాల సమీపంలోనే జమ్మిచెట్టు ఉండేది. దసరా రోజున ఈ జమ్మిచెట్టు చెంతన పూజలు నిర్వహించేవారు. దీంతో విజయదశమి నాడు నంబర్ 2 బస్తీకి చెందిన కృష్ణ భజన బృందం, ఇల్లెందుల పాడు నుంచి శ్రీరామ భజన బృందం సభ్యులు కృష్ణుడు, రాముడి ప్రతిమలను కావడి/పల్లకిలో మోసుకూంటూ ఈ జమ్మిచెట్టు మైదానానికి చేరుకునేవారు. అక్కడ సామూహిక భజనతో పాటు జమ్మిపూజలు ఘనంగా జరిగేవి.
1940వ దశకంలో మొదలు
గోవింద్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా నివసించే బ్రిటిష్ కుటుంబాలు, నిజాం ఉద్యోగుల కుటుంబాలు సైతం క్రమంగా ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేవి. అలా 1940వ దశకం నుంచి ప్రభుత్వ, పాలకులంతా కలిసి ఘనంగా దసరా నిర్వహించడం మొదలైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
సందడే సందడి..
ఒకప్పుడు శ్రీరామ, శ్రీ కృష్ణ భజన బృందాలే ఇక్కడికి శావలు తీసుకొచ్చేవి. ఆ తర్వాత ఇతర కాలనీలు, అసోసియేషన్ల తరఫున కూడా శావలు తీసుకురావడం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు శావలు జమ్మిగ్రౌండ్‌కు చేరుకునేవి. జమ్మిపూజకు వచ్చిన భక్తులు చివరి శావ వచ్చేవరకూ ఎదురు చూసేలా ఉండడం కోసం 1993 నుంచి మ్యూజికల్ నైట్ సైతం ఈ వేడుకల్లో భాగమైంది. ఆ తర్వాత డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 2013 నుంచి రావణవధ సైతం ఇక్కడ వేడుకగా నిర్వహిస్తున్నారు.
వీఐపీల రాక..
రాష్ట్రంలో విజయదశమి వేడుకలు అంటే ఇల్లెందులోనే అనేంత ఘనంగా జరుగుతాయి. ప్రతీ దసరా కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా వస్తుంటా రు. క్రమంగా ఇల్లెందులో కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్సవాల నిర్వహణలో మాత్రం ఏ మార్పూ రాలే దు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరాకు ఇల్లెందు రావడానికి ఆసక్తి కనబరుస్తారు. జమ్మి వేడుకల అనంతరం సమీపంలోని కోటమైసమ్మ జాతరకు పోటెత్తుతారు. విజయదశమి రోజు న పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లలో తెల్లవార్లూ ప్రదర్శనలు ఉంటాయి. దాదాపు 80 ఏళ్లుగా మిషన్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ఉత్సవాలను ఈసారి జేకే స్కూల్ గ్రౌండ్‌కు మార్చారు. ఈ కొత్త వేదికలో జమ్మి వేడుకలు ఎలా జరుగుతాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
భక్తి భావాన్ని కొనసాగిస్తున్నాం..
మా పూర్వీకులు ప్రతిరోజూ సాయంత్రం శ్రీరామ భజన మందిరంలో స్వామివారిని స్మరిస్తూ భజన చేసేవారు. దసరా ఉత్సవాల సమయంలో రథాన్ని అందంగా అలంకరించి జమ్మి గ్రౌండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేసేవారు. 80 ఏళ్ల క్రితం నాటి ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నాం.
– శ్రీరామ భజన బృందం సభ్యులు, ఇల్లెందు
భక్తులను ఉత్సాహ పర్చేందుకే
ఇల్లెందులో దసరా, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవాళ్లం. దసరా ఉత్సవాల్లో జమ్మిగ్రౌండ్‌కు వచ్చే భక్తులను ఉత్సాహపర్చేందుకు 1983 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2013 నుంచి రావణ వధ కూడా చేస్తున్నాం.
– మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఇల్లెందు
భక్తులు ఆశించిన విధంగా దసరా ఉత్సవాలు
దశాబ్దాలుగా ఇల్లెందులో దసరా ఉత్సవాలు మైసూర్ తరహాలో కొనసాగుతున్నాయి. గతానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకోసం మున్సిపల్ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అందరం కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం.
– దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్, ఇల్లెందు.
Comments
Please login to add a commentAdd a comment