
ఖమ్మం గాంధీచౌక్ : శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమిగా జరుపుకోవడం అనాదిగా ఆచారం. ప్రాంతాల వారీగా పండుగను వివిధ రూపాల్లో జరుపుకుంటుండగా... ఖమ్మంలో కూడా పండుగకు ప్రత్యేకత ఉంది. జిల్లాలోని కారేపల్లి మండలంలో కోట మైసమ్మ జాతర ఇదేరోజు ప్రారంభమవుతుంది. అలాగే, ఖమ్మం నగరంలో విజయదశమి రోజున జమ్మిబండపై ప్రత్యక్షమయ్యే శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రజలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
దేవస్థానమే మూలంగా ఖమ్మం
ఖమ్మంకు మూలం స్తంభాద్రి గుట్ట. శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధారంగానే ఖమ్మం ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. ప్రాచీన దివ్యక్షేత్రంగా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుగొందుతోంది. త్రేతాయుగంలో మౌద్గల్య మహాముని తన శిష్యులతో గుహలో తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యారని నమ్మిక. అప్పుడు స్వామిని ఈ కొండపై లక్ష్మీ సమేతుడవై కొలువై ఉండాలని ముని ప్రార్థించగా స్వామి దక్షిణ ముఖంగా గుహలో వెలిశాడు. స్తంభం నుంచి ఉద్భవించిన స్వామి కావడంతో ఈ క్షేత్రానికి స్తంభాద్రి అని పేరు స్థిరపడి, కాలక్రమంలో స్తంభాద్రిపురంగా, ఖమ్మం మెట్టుగా, ప్రస్తుతం ఖమ్మంగా వాడుకలో ఉంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రతాపరుద్రుడి హయంలో ఆలయాన్ని లకుమారెడ్డి, వేమారెడ్డి సోదరులు నిర్మించినట్లు చరిత్ర పేర్కొంటోంది.
ప్రతాప రుద్రుడి కాలం నుంచి..
ఖమ్మం నగరంలోని జమ్మిబండపై ఏటా విజయదశమి రోజున నిర్వహించే కార్యక్రమాలను ప్రభుత్వ లాంచనాలతోనే జరుపుతున్నారు. ప్రతాపరుద్రుడి కాలం మొదలు నిజాం నవాబు కాలంలో కూడా ఇది అమలవుతోంది. ప్రస్తుతం కూడా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ద్వారా విజయదశమి వేడుకలను నిర్వహిస్తుండగా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటారు.
ఆపద్బాంధవుడు నృసింహుడు
ఆపదలో ఆదుకునే ఆపద్బాందవుడు లక్ష్మీనరసింహస్వామి. విజయదశమి రోజున స్వామి జమ్మిబండపై పారువేటకు ప్రత్యక్షమవుతారు. స్వామిని ఈ రోజు దర్శించుకుంటే శుభం జరుగుతుందని నమ్మిక. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ విజయదశమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
– నరహరి నర్సింహాచార్యులు, ప్రధాన అర్చకులు, శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం
ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు
ఖమ్మం జమ్మిబండపై విజయదశమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం. స్తంభాద్రి గుట్టపై నుంచి పల్లకీలో స్వామిని బోయలు మోస్తూ జమ్మిబండపైకి తీసుకొస్తారు. పారువేట, శమీ పూజ, స్వామి వారి దర్శనం తర్వాత తిరిగి స్తంభాద్రి ఆలయానికి చేరుస్తాం.
– కొత్తూరు జగన్మోహనరావు, ఈఓ,
శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం
విజయ దశమి వేడుకలు బుధవారం జరుపుకోనున్నారు. ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఊరేగింపుగా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రజల దర్శనార్థం తీసుకువస్తారు. స్వామి వారి వద్ద శమీ పూజలు నిర్వహించి, ప్రజల దర్శనం అనంతరం రాత్రి 9:30 గంటలకు తిరిగి స్తంభాద్రి ఆలయానికి గుట్టపైకి తీసుకుకెళ్తారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు జమ్మిబండపై స్వామి వారి దర్శనానికి బారులు తీరుతారు. ఇందుకోసం దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాట్లుపూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment