పోలీసుల అదుపులో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ(చంద్రన్న వర్గం) కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న
ఇల్లెందు : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ పెద్ద చంద్రన్న, గుంటూరు జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, మరో నాయకుడు దుర్గాప్రసాద్‌ను గుంటూరులో జంగారెడ్డిగూడెం పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎన్డీ అగ్రనేతల్లో చంద్రన్న ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారు. చంద్రన్న వెంట పార్టీ ఖమ్మం – వరంగల్ ఏరియా కార్యదర్శి అశోక్ సైతం ఉన్నారనే సమాచారంతో పోలీసులు వల విసిరారని, కానీ చంద్రన్న ఒక్కరే పోలీసులకు చిక్కారని ప్రచారం సాగుతోంది.1967 నుంచి అజ్ఞాతంలో ఉంటున్న పెద్ద చంద్రన్నకు ఆదర్శ విప్లవ కమ్యూనిస్టుగా పేరుంది. పార్టీలో నిస్వార్థంగా పని చేసేందుకు తమకు సంతానం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దంపతులిద్దరూ కు.ని. శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
1967లో ఆవిర్భవించిన సీపీఐ (ఎంఎల్).. గోదావరి పరీవాహక ప్రాంతంలో బలమైన విప్లవ ఉద్యమాన్ని నడుపుతున్న క్రమంలో 1984లో పార్టీలో సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో చీలిక ఏర్పడింది. దీనికి ముందు విప్లవ మేధావి చండ్ర పుల్లారెడ్డి (సీపీరెడ్డి)ని సిద్ధాంతపరంగా ఎదుర్కొన్న వారిలో రాయల సుభాష్‌చంద్రబోస్‌తోపాటు చంద్రన్న కూడా ఉన్నారు. చీలిక అనంతరం ప్రజాపంథాగా ఆవిర్భవించిన పార్టీకి చంద్రన్న, రాయల బోస్, పైలా వాసుదేవరావు నాయకత్వం వహించారు. సీపీ రెడ్డి నేతృత్వంలోని మరో వర్గం విమోచన గ్రూపుగా ఏర్పడింది. ఇందులో కూర రాజన్న, మ«ధు, అమర్, సత్తెన్న, ప్రసాదన్నలు సీపీకి అండగా నిలిచారు. ఇక ప్రజాపంథా కొంత కాలం తర్వాత ఎన్డీగా ఆవతరించింది. ఒక దఫా ఉమ్మడి ఎన్డీకి చంద్రన్న కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. అయితే ఎన్డీలోనూ సిద్ధాంత పర విభేధాలు సంభవించి 2013లో చీలిక ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద చంద్రన్న నాయకత్వంలో ‘ఎన్డీ చంద్రన్న వర్గం’, రాయల బోసు నాయకత్వంలో ‘ఎన్డీ రాయల వర్గం’గా ఏర్పడ్డాయి. చంద్రన్న వర్గానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఇల్లెందుకు చెందిన సాధినేని వెంకటేశ్వరరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా చంద్రన్న సతీమణి పి.లక్ష్మి(టాన్యా) పని చేసున్నారు. అయితే చీలిక అనంతరం ఎన్డీలోని రెండు వర్గాలు కూడా మరింత క్షీణ దశకు చేరుకున్నాయి.
మూడో తరానికి మిగిలింది అశోకే..
ప్రస్తుతం 73 సంవత్సరాల వయసున్న చంద్రన్న దాదాపు 53 ఏళ్లు రహస్య జీవితమే గడిపారు. ఆయన అరెస్ట్‌తో తొలితరం విప్లవకారుల్లో ఇక ఎవరూ అజ్ఞాతంలో లేనట్టే. ఇక మూడో తరం నేతల్లో వరంగల్–ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్ ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారు. అయితే రెండు జిల్లాల్లో పోలీసుల కూంబింగ్ తీవ్రం కావడంతో వేసవికి ముందే ఆయన ఏపీకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. అశోక్ గత కొంత కాలంగా పెద్ద చంద్రన్నతో కలిసి సంచరిస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తుండడంతో తెలంగాణ–ఏపీ పోలీసులు అశోక్‌పై దృష్టి సారించారని, ఈ క్రమంలోనే చంద్రన్న చిక్కారని తెలుస్తోంది.
అరెస్టు పట్ల పలువురి ఖండన..
ఎన్డీ అఖిల భారత కార్యదర్శి ప్రధాన కార్యదర్శి చంద్రన్నను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్ ఖండించారు. 73 ఏళ్ల వయసులోనూ పీడిత ప్రజల కోసం పోరాడుతున్న చంద్రన్న విప్లవ యో«ధుడని పేర్కొన్నారు. పార్టీ నాయకులు వై.సత్యం, రమేష్, రాసుద్ధీన్, సాంబ, గణేష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. కాగా, చంద్రన్న అరెస్టును ఎన్డీ(రాయల) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు మధు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చండ్ర అరుణ, ఎన్టీ పట్టణ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎన్. రాజు తదితరులు ఖండించారు. చంద్రనన్ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందులోని పార్టీ కార్యాలయంలో గుమ్మడి నర్సయ్య, మధు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment