
అగ్నిమాపక శాఖలో హైడ్రాలిక్ ఫైరింజన్లు
బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే.. నేరుగా మంటలార్పేందుకు తోడ్పడే హైడ్రాలిక్ ప్లాట్‌ఫాం వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.
♦ బహుళ అంతస్తుల భవనాల్లో మంటలార్పేందుకు వినియోగం
♦ రూ.20 కోట్లతో ఆరు కొత్త వాహనాల కొనుగోలుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే.. నేరుగా మంటలార్పేందుకు తోడ్పడే హైడ్రాలిక్ ప్లాట్‌ఫాం వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. 14 అంతస్తులకన్నా పెద్ద భవనాల్లోనూ సహాయక చర్యలకు తోడ్పడే ఈ అత్యాధునిక వాహనాలను అగ్నిమాపకశాఖ సమకూర్చుకుంటోంది. రూ.20 కోట్లు వెచ్చించి ఆరు హైడ్రాలిక్ వాహనాల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. వేసవి నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ల వంటి కారణాలతో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ నెలాఖరు నాటికి నూతన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. వీటిలో నాలుగింటిని హైదరాబాద్‌కు, వరంగల్, కరీంనగర్‌లకు ఒక్కోటి కేటాయించనున్నారు.
గంటల వ్యవధిలో అదుపులోకి..
రాష్ట్రంలో ఏటా అగ్నిప్రమాదాల ఘటనలు పెరుగుతున్నాయి. అంతేస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 5వేల అగ్నిప్రమాదాలు జరుగగా... అందులో బహుళ అంతస్తుల భవనాల్లో చోటు చేసుకున్నవి 1,650. ఇక బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సాంప్రదాయ ఫైరింజన్లతో గంటల తరబడి ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. పైగా ఫైర్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లో ఓ భారీ భవనంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపు చేయడానికి 36 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అలాంటి చోట్ల హైడ్రాలిక్ వాహనాలను ఉపయోగిస్తే తక్కువ వ్యవధిలోనే మంటలను అదుపు చేయవచ్చని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. హైడ్రాలిక్ వాహనాలకు ఉండే క్రేన్ సహా యంతో నేరుగా 14వ అంతస్తుకైనా సులభం గా చేరుకుని నీటిని, ఫోమ్ గ్యాస్‌ను పంపవచ్చు. అక్కడ చిక్కుకున్నవారిని సులభంగా రక్షించవచ్చు. అందువల్ల నగరాలు, పట్టణాల్లో ఈ వాహనాలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపకశాఖ నిర్ణయించింది.