
బిర్యానీ ఊదేసి... మందేసి... చిందేశారు
తార్నాకలోని మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది మందేసి... చిందేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: తార్నాకలోని మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది మందేసి... చిందేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ మెన్లు అమరనాథ్ గౌడ్, ఏ మల్లేష్, ఓం నమశ్శివాయలతోపాటు ఫైరింజన్ డ్రైవర్ వీరాస్వామి మందు వేశారు. అనంతరం పాటలు పెద్దగా పెట్టుకుని చిందేశారు. ఆ విషయాన్ని ఆగంతకులు ఫోటోలు తీసి.. మీడియా వారికి అందజేశారు. ఆ ఫోటోలు మీడియాలో హల్చల్ చేశాయి.
ఈ ఘటనపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు మౌలాలి అగ్నిమాపక కేంద్రం ఉన్నతాధికారి చంద్రశేఖర్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. వారికి సెల్ఫోన్ స్విచ్చాఫ్ అని సమాధానం వస్తుంది. అలాగే మందేసి చిందేసిన సదరు నలుగురు మందుబాబుల సెల్ఫోన్లు కూడా మూగబోయాయి. నగరమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే... తమను రక్షించేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.