ఐదేళ్ళుగా నిరుపయోగంగా ఉన్న బోరు , నిరుపయోగంగా ఉన్న నీళ్ళస్టోరేజ్ తొట్టి
కంభం : తీవ్ర వర్షాభావ పరిస్థితులు అడుగంటిన భూగర్భజలాలతో ఓ వైపు రైతులు, ప్రజలు అల్లాడుతుంటే మరో వైపు అగ్నిమాపక శాఖ కూడా నీళ్ళకోసం తంటాలు పడుతుంది. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. మంటలను ఆర్పివేయడానికి చాలా చోట్ల అగ్ని మాపక కేంద్రాల ద్వారా స్పందిస్తుంటారు. అలాంటి అత్యవసర పరిస్థితుల నుంచి ప్రాణాలును, ఆస్తులను కాపాడే అగ్ని మాపక కేంద్రంలో నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. కంభం అగ్నిమాపక కేంద్రంలో 5 సంవత్సరాల నుంచి బోరు పనిచేయక పోవడంతో నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు.
కంభం, అర్థవీడు, బేస్తవారిపేట మండలాలకు కలిపి కంభంలో అగ్నిమాపక కేంద్రం ఉంది. తీవ్ర వేసవి దృష్ట్యా మూడు మండలాల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటుంది. ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న సిబ్బంది వాహనంలో నీళ్ళకోసం వెతుకులాడి అక్కడికి వెళ్ళే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోరు ఒట్టిపోయి ఐదేళ్ళుగా నీళ్లురాక ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు కానీ ప్రజా ప్రతినిధులు సమస్య పరిష్కారంపై దృష్టి సారించడంలేదు. కార్యాలయంలో బోరు పనిచేయక పోవడంతో నీళ్ళు నిలువ చేసే తొట్టె, మోటారు నిరుపయోగంగా పడిఉన్నాయి.
తీవ్ర నీటి సమస్యకు తోడు కరెంటు కోతలు కూడా ఇష్టానుసారంగా విధిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బందిబాధలు వర్ణనాతీతంగా మారాయి.ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయంలో రీబోర్ చేయించడమో లేదా మరో చోట ఎక్కడైనా బోరువేయించి సమస్యను పరిష్కరించడమో చేయకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే సమస్యను పరిష్కరించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
యన్ బాలచెన్నయ్య , ఫైర్ ఆఫీసర్, కంభం
నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్లవెంట బోర్లకోసం వెతుక్కోవాల్సి వస్తుంది. బోరులేకపోవడం తో స్టోరేజ్ ట్యాంక్ నిరుపయోగంగా పడిఉంది.
Comments
Please login to add a commentAdd a comment