ఉలిక్కిపడ్డ సిటీ | Fire breaks out at workshop; no casualty reported | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డ సిటీ

Published Mon, Mar 16 2015 2:33 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

Fire breaks out at workshop; no casualty reported

ఐటీఐ గిల్డ్‌లో ప్రమాదం
- భీతిల్లిన జనం
- కోట్ల రూపాయల ఆస్తినష్టం
మెహిదీపట్నం: నగరం నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో సిటీ ఉలిక్కిపడింది. గంటల పాటు ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు.  కిలోమీటర్ల మేర పొగలు వ్యాపిస్తూ మంటలు ఎగిసి పడటంతో సమీప ప్రాంతవాసులు కలవర పడ్డారు.

ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక అధికారులు ఉరుకులు,పరుగులు తీశారు. పదహారు అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి, ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఆదివారం సాయంత్రం విజయనగర్‌కాలనీ మల్లేపల్లి ఐటీఐ గిల్డ్ స్థలంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చాలా కాలం నుంచి చిన్న చిన్న వాహనాల రిపేర్ షెడ్లతో పాటు వెల్డింగ్ దుకాణాలు, డెంటింగ్ షెడ్లు వంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

కాగా ఆదివారం విజయనగర్‌కాలనీ చౌరస్తా వైపు ఓ మూలన చిన్న షెడ్డులో మధ్యాహ్నం 3:30 గంటల సమీపంలో చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మంటలు కొద్ది కొద్దిగా వ్యాపిస్తూ మిగతా షెడ్లలోకి వ్యాపించాయి. షెడ్లలో దాదాపు రసాయనాలు, పాత టైర్లు ఉండడంతో మంటలు వేగంగా చెలరేగాయి. ఈ ప్రారంతం ఎప్పుడూ ర ద్దీగా ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో షాపులు మూతపడ్డాయి. దీంతో ప్రాణనష్టం, పెనుప్రమాదం తప్పింది.
 
స్పందించిన ఎస్బీ కానిస్టేబుల్...
ఘటనా స్థలం నుంచి బైక్‌పై వెళ్తున్న స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ టి.దిగంబర్‌సింగ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అందరూ సకాలంలో వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
 
16 ఫైరింజన్లు 20 నీళ్ల ట్యాంకర్లు...
మాదాపూర్, మొగల్‌పురా,సికింద్రాబాద్,హైకోర్టు, మలక్‌పేట, మౌలాలీ, సనత్‌నగర్, ఇంబ్రహీంపట్నం, లంగర్‌హౌస్, అసెంబ్లీ, గౌలిగూడ, ఫిలింనగర్, ముషీరాబాద్, సాలార్‌జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్‌ల నుంచి వాహనాలు వచ్చాయి. మరో 20 నీళ్ల ట్యాంకర్లు(ప్రైవేట్) రప్పించారు. సహాయక చర్యల్లో ఫైర్ డెరైక్టర్ పి.వెంకటేశ్వర్, డీఎఫ్‌ఓ మహేందర్‌రెడ్డి, ఫైర్ ఆఫీసర్ విజయ్‌కుమార్‌లతో పాటు ఆయా ఫైర్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
ఆదివారం కావడంతో తప్పిన ప్రాణ నష్టం...
ఆదివారం సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కేవలం రూ.కోట్లలో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఇక్కడ 110 షాపులలో (కారు మెకానిక్, కార్పెంటర్, డెంటర్, పెయింటర్ తదితర కార్ఖానాలు) కనీసం మూడు వేల మంది కార్మికులు పని చేస్తుంటారు. సాధారణ రోజుల్లో ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.
 
నిల్వ ఉన్న ఆయిల్ కొంప ముంచింది...
ఐటీఐ గిల్ సుమారు ఐదేకరాల స్థలంలో ఉం ది. ఈ ప్రభుత్వ భూమిని కొందరు లీజ్‌కు తీసుకుని మొటారు మెకానిక్ వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. ఈ గిల్‌లోని అన్ని దుకాణాలలో ఇంజన్ ఆయిల్ నిల్వలు ఉండటం కూడా మంటలు అదుపు రాకపోవడానికి ఒక కారణం. దీనికి తోడు కార్లకు ఉపయోగించే పెయింట్స్ కూడా ఉండటంతో మంటలు క్షణాల్లో చుట్టుపక్క దుకాణాలకు పాకాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement