అబలలు కాదు... అగ్గి రవ్వలు | Women firefighters extinguish stereotypes in jaipur | Sakshi
Sakshi News home page

అబలలు కాదు... అగ్గి రవ్వలు

Published Tue, Mar 17 2015 11:46 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

అబలలు కాదు... అగ్గి రవ్వలు - Sakshi

అబలలు కాదు... అగ్గి రవ్వలు

ఎక్కడ కాస్త నిప్పు ఎగసినా వెంటనే ఫైర్ స్టేషన్లో ఫోన్ మోగుతుంది.

తన పవిత్రతను నిరూపించుకోవడానికి నాడు అగ్నిపరీక్షకు తల వంచింది సీతాదేవి. తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి నేడు రోజూ అగ్నికి ఎదురెళ్తున్నారు జైపూర్ మహిళలు. మగవాళ్లు మాత్రమే చేయగలరు అనుకునే ఫైర్ ఫైటింగ్‌ని తామూ చేయగలమంటూ బరిలోకి దిగుతున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు!
ఎక్కడ కాస్త నిప్పు ఎగసినా వెంటనే ఫైర్ స్టేషన్లో ఫోన్ మోగుతుంది.

తక్షణం నలుగురైదుగురు పురుషులు ఫైరింజన్‌తో ప్రమాద స్థలానికి పరుగులు తీస్తారు. ఇది ఎన్నో యేళ్లుగా అందరూ చూస్తున్న దృశ్యం. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఓ స్టేషన్‌లో కూడా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. కానీ అక్కడ పురుషుల స్థానంలో మహిళలు ఉంటారు. కబురు అందిందే తడవుగా అగ్నితో చెలగాట మాడటానికి సమాయత్తమై వెళ్తారు.
 
సాహసమే ఊపిరిగా...
ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం 155 మంది ఫైర్ సిబ్బందిని నియమించుకుంది. అయితే వాళ్లందరూ మహిళ లే కావడం విశేషం. మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించి, వారికి జీననభృతిని ఏర్పరచాలనే ఉద్దేశంతో పాటు... తలచుకుంటే మహిళలు ఏ పని అయినా చేయగలరు అని నమ్మడం వల్లే వారిని ఈ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని రాజస్థాన్ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. వారి నమ్మకం నిజమే అయ్యింది. ఫైర్ విభాగంలో నియమితులైన మహిళలంతా తమ సత్తా చాటుతున్నారు. ప్రాణాలకు తెగించి అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు.
 
నిజానికి ఫైర్ విభాగంలో పని చేయడం అంత తేలికేమీ కాదు. బరువైన పరికరాలను ఎత్తాల్సి ఉంటుంది. వాటిని పట్టుకుని పరుగులు తీయాల్సి ఉంటుంది. మంటల వేడిని తట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మంటల్లో చిక్కుకుపోతే, వారిని కాపాడేందుకు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో భవంతులు ఎక్కడం, ప్రమాదకర పరిస్థితుల్లో పైనుంచి దూకడం వంటి సాహసాలు కూడా చేయాల్సి వస్తుంది.

ఇవన్నీ చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. కానీ మహిళలేమో సున్నితత్వానికి ప్రతీకలాయె. అందుకే తొలుత విధులు కాస్త కష్టంగానే ఉండేవి అంటారు సునీత. ‘‘విధులేంటి... అసలు మా శిక్షణే చాలా కఠినంగా అనిపించేది. కొందరైతే ఆయాసపడిపోయేవారు. కష్టంగా ఫీలయ్యేవారు. వదిలేసి వెళ్లిపోదామనుకున్నవారూ ఉన్నారు. కానీ మా విధుల నిర్వహణకు అవసరమైన దృఢత్వాన్ని సంపాదించాలన్నా, మేమేంటో చూపించాలన్నా అలాంటివన్నీ అధిగమించక తప్పదు కదా’’ అంటారామె.
 
నిజమే. అవరోధాలను అధిగమిస్తేనే అనుకున్నది సాధించేది. అలా అధిగమించారు కాబట్టే ఈ మహిళలందరి గురించీ ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటోంది. సీత, సునీత, మనోజ్, నిర్మా, నిర్మల తదితరులను చూసి శభాష్ అంటోంది. ‘‘మా మహిళా ఉద్యోగులంతా ఎంతో చక్కగా పని చేస్తున్నారు. నిజాయతీతో, నిబద్దతతో వ్యవహరిస్తారు. పెద్ద పెద్ద ప్రమాద సమయాల్లో సైతం నిర్భయంగా నడచుకోవడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అంటారు చీఫ్ ఆఫీసర్ ఈశ్వర్. అందుకే కదా మరి... ఈ లేడీ ఫైర్ ఫైటర్స్‌ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా మహిళలకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నాయి! వారి ఆలోచన ఆచరణలోకి వస్తే బహుశా త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా ఫైర్ ఫైటర్స్ దర్శనమి స్తారు. ఆడది అబల కాదన్న నానుడిని బల్లగుద్ది చెబుతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement