
ఇక 15 నిమిషాల్లోనే ఫైరింజన్!
అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. సత్వరమే ఘటనాస్థలానికి వెళ్లే విషయంపై కసరత్తు చేస్తోంది.
ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అప్రమత్తం
♦ పోలీసు, జలమండలి, ఆరోగ్య, విద్యుత్ శాఖలతో సమన్వయం
♦ నీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్లతో ఒప్పందం
♦ భారీగా అందుబాటులో ఉంచుకున్న ఫోమ్ సిలిండర్లు
♦ హైదరాబాద్‌లో అందుబాటులో 20 మోటార్ సైకిళ్లు
సాక్షి, హైదరాబాద్: అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. సత్వరమే ఘటనాస్థలానికి వెళ్లే విషయంపై కసరత్తు చేస్తోంది. ప్రమాదం చోటు చేసుకున్న పదిహేను నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి ఫైరింజన్ వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటోంది. దీనికి ఆటంకంగా ఉన్న ట్రాఫిక్, నీటి సమస్యలను అధిగమించేందుకు పోలీసు, జలమండలి శాఖలతో సమన్వయం చేసుకుంటోంది. నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఘటనాస్థలానికి ఫైరింజన్‌ను నీటి ట్యాంకర్లు కూడా అనుసరించనున్నాయి.
హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ ఇంజన్‌ను జలమండలికి చెందిన ట్యాంకర్లు అనుసరించేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇతర ముఖ్య పట్టణాలలో కూడా ప్రైవేటు ట్యాంకర్లలతో ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా పరిశ్రమలతోపాటు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వద్ద నీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అగ్నిమాపక శాఖ ఆదేశాలిచ్చింది. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ 70 నుంచి 80 వరకు అగ్నిప్రమాదాల ఫిర్యాదులు వస్తుండటంతో శాఖ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రతన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
నాలుగు శాఖలతో సమన్వయం..
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని అదుపు చేయడంతోపాటు నష్టనివారణ చర్యలు చేపట్టడం కోసం అగ్నిమాపకశాఖ నాలుగు విభాగాలతో సమన్వయం చేసుకుంది. పోలీసు, జలమండలి, ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖలతో సమన్వయం చేసుకుంది. ఎక్కడైన ప్రమాదం జరిగిన వెంటనే నాలుగు విభాగాలకు ఒకేసారి సమాచారం అందేలా కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడం కోసం 108 అంబులెన్స్ కూడా వెంటనే ఘటనాస్థలానికి చేరుకోనుం ది. వాటర్ ట్యాంకర్ల అందజేయడం కోసం జలమండలి, విద్యుత్ సరఫరా విషయమై అంచనా వేయడానికి ఆ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగనున్నారు. ఇలా నాలుగు శాఖలను సమన్వయం చేయడం కోసం కంట్రోల్ రూమ్ వద్ద 24 గంటలపాటు అందుబాటులో ఉంచేలా వ్యవస్థను రూపొందించారు.
అందుబాటులోకి ఫైర్ మోటార్ సైకిళ్లు
చిన్న, చిన్న ప్రమాదాలు తలెత్తితే మహానగరాల్లో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకునేందుకు అగ్నిమాపకశాఖ మోటార్ సైకిళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రమాదం తలెత్తితే వెంటనే ఫోమ్ సిలిండర్లు అమర్చిన మోటార్ సైకిళ్లు రంగంలోకి దిగనున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 20 మోటార్ సైకిళ్లను సిద్ధంగా ఉంచారు. వరంగల్, కరీంనగర్‌లలో కూడా ఈ వాహనాలను ఏర్పాటు చేశారు.