అగ్ని ప్రమాదం (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: అసలే వేసవికాలం.. ఆపై 45 డిగ్రీలకు పైగా ఎండలు.. మండిపోతున్న మే నెల. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎండ వేడితో షార్ట్ సర్క్యూట్లు జరిగి అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నియంత్రణకు, ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేసేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీ నాలుగేళ్లయినా పూర్తికాలేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో అగ్నిప్రమాదాలతో ఆస్తులు ఆహుతైపోతున్నాయి.
ఇక ఒక్కో నియోజకవర్గంలో కనీసం 4 నుంచి 5 మండలాలుంటాయి. నియోజకవర్గం పేరుతో ఉన్న అర్బన్ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రానికి దూరంగా ఉన్న మండలంలోని ఏదో మారుమూల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజన్ వచ్చి మంటలార్పేసరికి ఆస్తులు బూడిదై పోతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు పెద్ద నియోజకవర్గాలు, పైగా పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ప్రతీ జిల్లా హెడ్‌క్వార్టర్‌లో రెండు ఫైర్‌స్టేషన్లు, శివారు ప్రాంతాలకు రూరల్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులే స్పష్టం చేస్తున్నారు. కానీ దీనిపై అగ్నిమాపక శాఖ దృష్టి సారించలేదు. గత రెండేళ్లలో 242 తీవ్ర అగ్నిప్రమాదాలు జరగ్గా, ఈ ప్రమాదాల్లో రూ.48 కోట్ల విలువైన ఆస్తి అగ్నికి ఆహుతైంది. 183 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment