క్రేన్ సాయంతో మృతదేహాన్ని తీయుటకు బావిలోకి దిగుతున్న స్థానికుడు
సాక్షి,దర్మసాగర్:అనుమానం నిజమైంది.అర్బన్‌జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి సమీపంలోని వ్యవసాయబావిలో శనివారం గుర్తించిన టార్పాలిన్ కవర్‌లో ఉన్నది మృతదేహమేనని తేలింది.ఆదివారం ధర్మసాగర్ పల్లెబండ సమీపంలోని రైతు కొట్టె విజయభాస్కర్ వ్యవసాయబావిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని సుమారు 30– 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని దుండగులు పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా శరీరంలోని వివిధ భాగాలపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీడ్(చీరలతో కుట్టినబొంత)లో చుట్టి దానిపై నుంచి టార్పాలిన్ కవర్‌లో ప్యాక్ చేశారు. అనంతరం దాని వెనుక పొడవైన బరువు ఉన్న బండరాయితో కట్టి వ్యవసాయ బావిలో పడవేశారు. కాగా మృతదేహాన్ని వ్యవసాయబావిలో పడేసి వారం రోజుల పైనే అవుతుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. మృతుడి ఒంటిపై ఫుల్‌హ్యాండ్స్ షర్ట్, మొకాలివరకు ఉన్న గుడ్డతోపాటు, మృతుడి జేబులో బీడీకట్ట, అగ్గిపెట్టె ఉన్నాయి.
ఇరవైనాలుగు గంటల తర్వాత మృదేహం వెలికి...
దారుణహత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికుల సహకారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇరవైనాలుగు గంటల పాటు కష్టపడిపైకి తీశారు. కాజీపేట ఏసీపీ నర్సింగరావు, ఎల్కతుర్తి ఎస్సై శ్రీనివాస్ జీ, ఎస్సై కరీం, వేలేరు ఎస్సై వీరభద్రరావు ఉదయం ఘటనా స్థలానికి క్రేన్‌ను తెప్పించి తాళ్లతో బయటకు తీసేందుకు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం హన్మకొండ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా జిల్లా ఫైర్ అధికారి భగవాన్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు నాగరాజులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సుచనల మేరకు బావిలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసి, క్రేన్ సాయంతో నిచ్చెనను బావిలోకి దింపారు.
అనంతరం గ్రామానికి చెందిన చిలుక రవీందర్, కొట్టె ప్రభాకర్‌లను ఆక్సిజన్ మాస్క్ వేసి బావిలోకి పంపించారు. వీరిద్దరు సుమారు అరగంటపాటు కష్టపడి మృతదేహాన్ని తాళ్లతో కట్టి బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలుసుకుని హత్య కేసును చేధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని కాజీపేట ఏసీపీ నర్సింగరావు తెలిపారు.
వరుస ఘటనలతో భయాందోళన..
ధర్మసాగర్ మండల పరిధిలో కొద్ది నెలల వ్యవధిలోనే వరుస హత్యలు చోటు చేసుకోవటంతో మండల వాసులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ముప్పారం శివారులో హత్యతోపాటు, మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన మరో వ్యక్తి వేలేరు సమీపంలో పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. కాగా ప్రస్తుతం మృతదేహం బయటపడిన వ్యవసాయబావిలో మూడు కిలో మీటర్లదూరంలో సుమారు ఎనిమిది నెలల క్రితం ఓ యువతి మృతదేహం సైతం బయటపడగా ఇప్పవరకు ఆ మృతురాలి వివరాలు సైతం తెలియరాలేదు. ఇప్పటికైనా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని మరోసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా చూడాలని, ఇప్పటి వరకు జరిగిన హత్యలకు కారణమైన వారిని గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment