పుష్కరాలకు అగ్నిమాపక శాఖ సిద్ధమైంది. జిల్లాలో 172 ఘాట్లలో 700 మంది సిబ్బందిని రక్షణ చర్యలకు వినియోగించనున్నారు.
రాజమండ్రి క్రైం : పుష్కరాలకు అగ్నిమాపక శాఖ సిద్ధమైంది. జిల్లాలో 172 ఘాట్లలో 700 మంది సిబ్బందిని రక్షణ చర్యలకు వినియోగించనున్నారు. ఘాట్లను ఏ, బీ, సీ జోన్లుగా విభజించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఘాట్లలో బోట్లు, పంపు క్లీనింగ్, లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉంటారు. బీ కేటగిరి ఘాట్లలో పంపు క్లీనింగ్, లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్లతో విధులు నిర్వహిస్తారు. సీ కేటగిరి ఘాట్లలో లైఫ్ జాకెట్లతో లైఫ్‌బాయ్స్ విధులు నిర్వహిస్తారు. వీటితోపాటు ఎనిమిది అగ్నిమాపక శకటాలు, మరో ఎనిమిది మిస్ట్ జీపులు అత్యవసర పరిస్థితులలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటాయి.
బోట్లతో ఘాట్లులో నిఘా
జిల్లా వ్యాప్తంగా ఏ కేటగిరి ఘాట్లలో బోట్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యశాఖ సమన్వయంతో అగ్నిమాపక సిబ్బంది ఏ కేటగిరి ఘాట్లు అయిన కోటిలింగాలు, పుష్కర, సరస్వతి, ధవళేశ్వరంలోని వీఐపీ, రామపాదాల ఘాట్లలో రోప్స్, పంప్స్, బోట్లు, అగ్నిమాపక శకటాలతో సేవలు అందిస్తారు. ఈ నెల 12 నుంచి అగ్నిమాపక సిబ్బంది విధులలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
2 షిఫ్టులలో సిబ్బంది సేవలు
రోజూ రెండు షిఫ్టులుగా సిబ్బంది సేవలు అందిస్తారు. ప్రతి 100 మీటర్లకు ఒకరు ఉండేలా చర్యలు చేపట్టారు. నదిలో బోట్లలో ఉంటూ సేవలు అందించడంతోపాటు ఘాట్లలో సంచరిస్తూ భక్తులకు సేవలందిస్తారు. ఏ కేటగిరి ఘాట్‌లో 50 మంది సిబ్బందిని, బీ కేటగిరి ఘాట్‌లో 10 మందిని, సీ కేటగిరి ఘాట్‌లో ఇద్దరిని నియమించారు.