
‘గ్రూప్స్’ ఫలితాలు మరింత ఆలస్యం!
- పోస్టులివ్వని పలు శాఖలు.. గ్రూప్–1 ఫలితాల్లో జాప్యం
- న్యాయ వివాదాలతో గ్రూప్–2 ఫలితాలు కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2011 గ్రూప్–1లో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు వెల్ల డించలేని పరిస్థితి నెలకొంది. గ్రామీణాభివృద్ధి శాఖ, అగ్నిమాపక శాఖలు పోస్టులను ఇవ్వకపోవడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. 2011లో జరిగిన గ్రూప్–1లో ప్రిలిమ్స్‌లో తప్పులు ఇచ్చిన వ్యవహారంలో కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో సుప్రీం కోర్టు మళ్లీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని 2014లో ఆదేశించింది. అప్పటికే రాష్ట్ర విభజన జరగడంతో మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వేర్వేరుగా నిర్వహించాలని ధర్మాసనం సూచించింది.
2011లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌లో ప్రకటించిన 312 పోస్టుల్లో తెలం గాణకు 140 పోస్టులు వచ్చాయి. అందులో 2007 గ్రూప్–1కు సంబంధించిన 13 పోస్టులను అప్పటి అభ్యర్థులకు ఇవ్వాలని కోర్టు మరో తీర్పు ఇచ్చింది. దీంతో 140 పోస్టుల్లో 13 పోస్టులు తొలగించి 127 పోస్టులకు 2016 సెప్టెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. వాటి మూల్యాంకనాన్ని అదే ఏడాది డిసెంబర్‌లో పూర్తి చేసింది. అయితే 2011లో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం, తెలంగాణకు కేటాయించిన పోస్టుల్లో 127 పోస్టుల్లో 117 పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలు టీఎస్‌పీఎస్సీకి అందాయి.
అందులో గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి 7 జిల్లా పంచాయతీ అధికారి పోస్టులకు రోస్టర్, రిజర్వేషన్ వివరాలు రావాల్సి ఉన్నా 2 పోస్టులకు సంబంధించి మాత్రమే ఆ శాఖ పంపింది. మరో 5 పోస్టుల వివరాలను పంపించాల్సి ఉంది. అయితే తమ వద్ద పోస్టుల్లేవని ఆ శాఖ చెబుతోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి, టీఎస్‌పీఎస్సీకి పంపించాలని నెల కిందే ఆదేశించారు. అయినా ఇంతవరకూ ఆ పోస్టుల వివరాలు రాలేదు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 8 ఉంటే ఆ శాఖ 3 పోస్టుల వివరాలే పంపింది. మరో 5 పోస్టులను సృష్టించి భర్తీ చేయాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ నుంచి కూడా ఆ వివరాలు రాకపోవడంతో గ్రూప్–1 ఫలితాల వెల్లడి ఆగిపోయింది.
గ్రూప్–2 ఫలితాల్లో తప్పని ఆలస్యం
గ్రూప్–2 కేటగిరీలో 1,032 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్ష కేంద్రాల్లో ఒకరి ఓఎంఆర్ జవాబు పత్రాలు మరొకరికి వచ్చాయని, ఫలితంగా తప్పుడు బబ్లింగ్ జరిగిందని, వాటికి మార్కులు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉంది. దీంతో గ్రూప్–2 ఫలితాల వెల్లడి ఆగిపోయింది. గ్రూప్–1కు సంబంధించి రెండు శాఖల నుంచి పోస్టులు వచ్చాక, ఫలితాలను ప్రకటించి 1:2 నిష్పత్తిలో 254 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్–2 అంశంపై కూడా కోర్టులో ఉన్న కేసు వ్యవహారం తేలాకా 1:2 రేషియోలో అభ్యర్థులకు ఇంటర్వూ్య నిర్వహించాల్సి ఉంది. దీంతో గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.