
కలెక్టర్ చాంబర్‌లో షార్ట్‌సర్క్యూట్
గురువారం ఉదయం 11:30 గంటలు... ఒక్క సారిగా కలెక్టర్ కార్యాలయంలో కలకలం. కలెక్టర్ చాంబర్ నుంచి నల్లటిపొగలు దట్టంగా వస్తున్నాయి
అనంతపురం అర్బన్ : గురువారం ఉదయం 11:30 గంటలు... ఒక్క సారిగా కలెక్టర్ కార్యాలయంలో కలకలం. కలెక్టర్ చాంబర్ నుంచి నల్లటిపొగలు దట్టంగా వస్తున్నాయి. సిబ్బందిలో ఆందోళన... ఏమి జరిగిందో అర్థం కాలేదు. చాంబర్ వద్దకు వెళ్లలేనంతగా లోపలి నుంచి పొగలు వెలువడుతున్నాయి. ఏఓ శివరామకృష్ణ అప్రమత్తయ్యారు. చాంబర్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.. ఐదు నిమిషాల వ్యవధిలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
చాంబర్‌లోని ఏసీ మిషన్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. దాని పక్కనే ఉన్న ప్రధాన తలుపు కొంత కాలింది. సకాలంలో అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారి శ్రీధర్, స్టేషన్ ఫైర్ అధికారి లింగమయ్య, తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చాంబర్ మొత్తం పొగ చూరింది. దట్టంగా వెలువడుతున్న పొగలోంచి వెళ్లి కలెక్టర్ చాంబర్ తలుపులు పగులకొట్టారు. పొగ బయటికి వెళ్లేందుకు వీలుగా చాంబర్ వెలుపల వెంటిలేటర్లకు ఉన్న అద్దాలను పగులగొట్టారు.
పరిస్థితి సమీక్షించిన డీఆర్‌ఓ
సమాచారం అందుకున్న డీఆర్‌ఓ హేమసాగర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏఓ శివరామకృష్ణ ద్వారా ఘటనకు సంబంధించి నివేదిక సిద్ధం చేయించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఏసీ మిషన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఇతర సామగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. ఏసీ మిషన్ కాలడంతో వెలువడిన పొగల కారణంగా చాంబర్‌లో కుర్చీలు, గోడలు పొగచూరినట్లు తెలిపారు.