ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :జిల్లాలో నిట్ (ఎన్‌ఐసి) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏలూరులోని పలు విద్యాసంస్థల విద్యార్థులు భారీఎత్తున బుధవారం ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో నిట్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నగర ప్రజలకు మరోసారి గుర్తు చేసే విధంగా నిర్వహించారు. ఇండోర్ స్టేడియం నుంచి పలు పాఠశాలల, కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేశారు. ఈ ఆందోళననుద్దేశించి నిట్ పరిరక్షణ సమితి నాయకులు, శ్రీశ్రీ విద్యాసంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ పరంగా అభివృద్ధి సాధించిన పశ్చిమగోదావరి జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు నిట్ సహాయ పడుతుందన్నారు. నిట్‌ను కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలను మోసగించడమేనన్నారు.
జిల్లాలో 15 ఎమ్మెల్యే, రెండు ఎంపీ పదవులను టీడీపీకి ప్రజలు కట్టబెట్టారని , భావితరాల వారి కోసం నిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులందరూ నిట్‌ను జిల్లాలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై వత్తిడి చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ జిల్లా కమిటీ సభ్యులు, సిద్దార్థ విద్యా సంస్థల అధినేత కోనేరు సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో నిట్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు. సంఘ నగర శాఖ గౌరవాధ్యక్షుడు ఎంఎల్‌ఎన్ శ్రీకాంత్ మాట్లాడారు.
ఆందోళన అనంతరం కలెకక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షులు బూరుగుపల్లి వేణుగోపాలరావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు జేఎస్ బాలాజీ, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు విజయలక్ష్మి, విజయకుమార్, ఎండీ సలీమా, ప్రగతిరాజు, జి.సత్యనారాయణ, సుబ్బరాజు, నల్లా వేణుగోపాలరావు, సంఘం మహేష్, తదితరులు నాయకత్వం వహించారు. శ్రీశ్రీ, సిద్దార్థ, చైతన్య, సూర్య న్యూజనరేషన్, భాష్యం, నారాయణ, శ్రీభారతి తదితర విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.
నిట్ కోసం ఫైట్
Published Thu, Dec 18 2014 2:05 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement