ఏనాటికైనా ఫైర్ ఫైటర్ అయి తీరాలన్న ఆమెలోని రగిలే జ్వాల ఆమె చేత ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మాన్పించి ఆమెను ఫైర్ ఫైటర్ చేసింది.
ఈ మాట మనదేశంలో ఇప్పటికే ఇద్దరు మహిళలు అనేశారు. ఇప్పుడు మరో మహిళ ప్రశ్నిస్తున్నారు. ఫైర్ ఫైటర్ ఉద్యోగంలో చేరిన తొలి మహిళ హర్షిణి కన్హేకర్‌ను ఆ ఉద్యోగంలో నియమించడానికి ఫైర్ డిపార్ట్‌మెంట్ చట్టాల్లోంచి వెసులుబాటు తెచ్చుకుంది. కన్హేకర్ వేసిన ఆ బాటలో మహిళల నడక మొదలైంది. కన్హేకర్, తానియా సన్యాల్ తర్వాత, ఏడాదిలోనే ఇప్పుడు మూడో మహిళ ఈ సాహసోపేతమైన ఉద్యోగంలోకి వచ్చారు. కేరళకు చెందిన రేమ్యా శ్రీకాంతన్ ఈ నెల ఒకటో తేదీన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫైర్ సర్వీస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఈ ఉద్యోగంలో చేరిన తొలి మహిళ రేమ్యా. దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది తొలి రికార్టే.
హర్షిణి కన్హేకర్‌కి యూనిఫామ్ సర్వీస్‌లో చేరాలనేది కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఫైర్ ఫైటర్ అయ్యారు. ఇప్పుడు ఈ కేరళ అమ్మాయి రేమ్యా శ్రీకాంతన్‌కి సవాళ్లతో నిండిన ఉద్యోగంలో రాణించాలని కోరిక. తిరువనంతపురానికి చెందిన రేమ్యా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ‘ఎల్‌బిఎస్ (లాల్ బహదూర్ శాస్త్రి) ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఫైర్ ఫైటర్‌గా వచ్చారు. రెండేళ్ల పాపాయికి తల్లి అయిన రేమ్యా ఫైర్ ఫైటర్ అవాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి కఠోరమైన శ్రమను ఎదుర్కొన్నారు. దేహదారుఢ్యం కోసం కఠినమైన ఎక్సర్‌సైజ్‌లు చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు.
‘‘అమ్మాయిలు అన్ని ఉద్యోగాలనూ చేయగలుగుతారని చెప్పడానికి నేనొక ఉదాహరణ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ బాటలో తప్పకుండా మరికొంత మంది అమ్మాయిలు నడుస్తారు’’ అంటున్నారు రేమ్యా. పాపాయిని పెంచుకుంటూ శిక్షణ తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించిన మాట వాస్తవమేనంటూ... ‘‘కొంతకాలం పాపాయిని చూసుకుంటూనే ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఢిల్లీ వాతావరణాన్ని తట్టుకోవడం కష్టమని పాపాయిని తీసుకెళ్లలేదు. ఢిల్లీలో ట్రైనింగ్ పీరియడ్ నాలుగు నెలలు మాత్రం పాపాయిని పూర్తిగా నా భర్త శ్రీకాంతనే చూసుకున్నారు’’ అన్నారామె భర్త పట్ల కృతజ్ఞతగా.
Comments
Please login to add a commentAdd a comment