తగలబడిపోయిన ఆటోకు సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ పోరుమామిళ్ల అగ్నిమాపక శాఖ అధికారి నారాయణ ఏసీబీకి దొరికిపోయారు.
పోరుమామిళ్ల : తగలబడిపోయిన ఆటోకు సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ పోరుమామిళ్ల అగ్నిమాపక శాఖ అధికారి నారాయణ ఏసీబీకి దొరికిపోయారు. తిరుపతి రేంజి ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డి కథనం మేరకు.. చింతకొమ్మదిన్నెకు చెందిన వి.నరసింహులు జనవరి 18న బ్రహ్మంగారి మఠం నుండి పోరుమామిళ్లకు మాక్స్ క్యాబ్ ఆటోలో ప్రయాణికులను తీసుకెళుతుండగా అమగంపల్లెకు సమీపంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆటో తగలబడిపోయింది.
స్థానికుల సమాచారం మేరకు పోరుమామిళ్ల ఫైర్ ఇంజన్ అక్కడకు వెళ్లి మంటలు ఆర్పింది. షార్ట్ సర్క్యూట్‌తో ఆటో తగలబడినట్లు సర్టిపికెట్ ఇవ్వాల్సిందిగా ఆటో యజమాని నరసింహులు ఫైర్ ఆఫీసర్ నారాయణను కోరాడు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆయన రూ.10 వేలు డిమాండ్ చేశాడు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని ఎంతగా చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. జనవరి నుంచి మే నెల వరకు ఫైర్ ఆఫీసర్ చుట్టూ తిరిగినా డబ్బు ఇవ్వందే సర్టిఫికెట్ ఇవ్వనని తేల్చి చెప్పడంతో రూ.8 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
నరసింహులు నేరుగా ఏసీబీ అధికారులను కలిసి వారి సూచన మేరకు బుధవారం రాత్రి పోరుమామిళ్ల ఫైర్ ఆఫీసులో ఫైర్ ఆఫీసర్ నారాయణకు రూ.8 వేలు అందజేశాడు. ఏసీబీ అధికారులు దాడి చేసి నారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ కడప ఇన్‌స్పెక్టర్లు పార్థసారథిరెడ్డి, శివశంకర్ నాయక్, తిరుపతి ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, లక్ష్మికాంత్, సుధాకరరెడ్డి ఈ దాడిలో పాల్గొన్నారు. కాగా, అగ్నిమాపక శాఖలో అవినీతిపై ‘ఇచ్చుకుంటే ఓకే’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఓ అధికారి ఏసీబీకి దొరకడం గమనార్హం.