
ఏసీబీ వలలో లంచావతారం
ఏసీబీ అధికారుల చేతికి మరో లంచావతారం చిక్కాడు.
►లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఫైర్ ఆఫీసర్
►ప్రైవేటు ఆస్పత్రి ఎన్‌వోసీ రెన్యువల్ కోసం రూ.35 వేలు డిమాండ్
ఒంగోలు క్రైం : ఏసీబీ అధికారుల చేతికి మరో లంచావతారం చిక్కాడు. ఓ ప్రైవేటు వైద్యశాల నిర్వాహకుల నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటున్న అగ్నిమాపక శాఖ అధికారిని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన ఒంగోలు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఒంగోలు నగరంలోని అరవై అడుగుల రోడ్డులో ఉన్న విజయ హాస్పటల్స్ నిర్వాహకులు వైద్యశాలకు సంబంధించిన అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలపై అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ)కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఇచ్చి ఉన్న ఎన్‌ఓసీని రెన్యూవల్ చేయటం కోసం 2016 డిసెంబర్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి సి.పెద్దిరెడ్డితో పాటు, ఏడీఎఫ్‌ఓ, ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారితో కూడిన కమిటీ పరిశీలించి ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి ఎన్‌ఓసీ ఇవ్వకుండా నాన్చుతూ వస్తున్నారు.
ఎన్ని సార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవటంతో గత వారం పది రోజులుగా విజయ హాస్పటల్స్ మేనేజర్ ఎంజేవీ శ్రీనివాస్ అగ్నిమాపక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు రూ.50 వేలు ఇస్తే కాని ఎన్‌ఓసీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో బేరాలాడి రూ.35 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని వైద్యశాల నిర్వాహకులు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ను ఆశ్రయించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించారు.
ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి ఎంవీ సుబ్బారావు మంగళవారం ఎంజేసీ శ్రీనివాస్ నుంచి రూ.35 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే కెమికల్స్‌తో ఎంవీ సుబ్బారావు పట్టుకున్న డబ్బులను, వాటిపై పడిన అధికారి వేలిముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకోవటానికి గల కారణాలను సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్‌ఓ సి.పెద్దిరెడ్డి, నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏడీఎఫ్‌ఓలు తీసుకోమంటేనే తాను డబ్బులు తీసుకున్నానని ఏసీబీ అధికారులకు చెప్పాడు. అనంతరం విజయ హాస్పటల్స్‌కు సంబంధించిన ఎన్‌ఓసీ ఫైల్‌ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి బస్టాండ్ సెంటర్‌లోని ఒంగోలు అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని కూడా నిశితంగా పరిశీలించారు. ఎంవీ సుబ్బారావు కార్యాలయంలోని కంప్యూటర్‌లో ఉన్న రికార్డులను కూడా పరిశీలించారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను కూడా స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం సుబ్బారావును ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ టీవీవీ ప్రతాప్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.