
అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రారంభించారు.
కర్నూలు: కర్నూలు అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రారంభించారు. సప్తగిరి నగర్‌లో అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన దేశంలోని అగ్ని మాపక సిబ్బందికి నివాళులు అర్పించారు. ప్రజ లకు అవగాహన కల్పించడం కోసం అగ్నిమాపక సిబ్బందిచే జారీ చేసిన కరపత్రాలు, ఫ్లెక్సీలు, గోడ పత్రికలను విడుదల చేసి వారోత్సవాలను ఎస్పీ ప్రారంభించారు. కర్నూలు అగ్నిమాపక స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫైర్ ఎగ్జిబిషన్ స్టాల్‌ను ప్రారంభించారు.
ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడే (రెస్క్యూ) పరికరాలను పరిశీలించారు. వారోత్సవాల సందర్భంగా నగరంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అగ్నిమాపక కేంద్రం స్టేషన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈనెల 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి భూపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ మేనేజర్ రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి బాలరాజు, అగ్నిమాపక కేంద్రాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు, అసిస్టెంట్ రిజిస్టర్లు గోపీకృష్ణ, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు.