అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిరంభ్యంతర పత్రాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే ఇస్తామని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
అమరావతి : అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిరంభ్యంతర(ఎన్‌ఓసీ) పత్రాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ తెలిపారు.
విజయవాడలో అగ్ని మాపక శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని జిల్లాల నుంచి వచ్చిన అంశాలు, సమస్యలను క్రోడీకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిపారు. భవంతులు, ఆస్పత్రులు, హోటళ్లు, మల్టీప్లెక్స్ వంటి వాటికి నిరంభ్యంతర పత్రాలను ఇకపై ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తామన్నారు. ఈ-ఆఫీసు విధానాన్ని అమలు చేసి పేపర్ రహిత పరిపాలనను చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదనపు డీజీ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఇద్దరు ఆర్‌ఎఫ్‌ఓలు, ఏడుగురు డీఎఫ్‌ఓలతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ఎప్పటికప్పుడు బిల్డర్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు వంటి అన్ని రంగాల వారితో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. తమ శాఖలో వివిధస్థాయిల్లో 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని దశల వారీగా భర్తీ చేస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారికి పూనేలో నిరంతరం శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.