సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని పలు వ్యాపార కేంద్రాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం సూచించే రక్షణ చర్యలను పెడచెవిని పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికార యంత్రాంగం రెండు మూడు రోజులకు ఎలాంటి చర్యలు తీసుకోకుం డానే వదిలేయడం పరిపాటిగా మారింది. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని పెయిం టింగ్, ఎలక్ట్రికల్ గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదం ఇందుకు ఓ ఉదాహరణ. అదృష్టవశాత్తూ ఇక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం వాటిల్లింది. వివిధ విభాగాల అధికార యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎన్నో గంటల పాటు పోరాడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నగరంలో తరచూ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. చర్యల్లో మాత్రం సంబంధిత యంత్రాంగం విఫలమవుతోంది. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత మరచిపోతున్నారు. గోడౌన్ల నుంచి హాస్పిటళ్లు, హోటళ్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల దాకా ఇదే పరిస్థితి. వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి తెలిసినా, చర్యలు తీసుకోలేకపోతున్నారు. పురాతన భవనాల నుంచి కొత్త బిల్డింగ్‌ల వరకు ఇదే పరిస్థితి. ఈ భవనాలకు ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడం.. ఉన్నా పనిచేయకపోవడం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెలుగుచూస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే ఫైరింజన్‌లు, అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని ఇరుకు గల్లీల్లో అనుమతుల్లేకుండానే గోడౌన్ల ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూళ్లకు మరిగిన స్థానిక అధికారులు అనుమతుల్లేకున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఫైర్‌సేఫ్టీ నిబంధనలు, అమలుపై కొరడా ఝళిపిస్తున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఫైర్ ఎన్‌ఓసీలు లేని విద్యాసంస్థలకు ఈ భవనం ప్రమాదకరమని సూచిస్తూ పుర్రె బొమ్మల పోస్టర్లు అంటిస్తామని బల్దియా ప్రకటించినప్పటికీ చర్యల్లేవు. ఏటా ఆయా భవనాలను తనిఖీ చేసి నోటీసులిచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా దాదాపు ఏడాదిన్నర కాలంగా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన భవనాలు నలభై వేలకు పైగా ఉన్నప్పటికీ దాదాపు మూడు వేల భవనాలకు మాత్రమే ఎన్‌ఓసీలు ఉన్నట్లు సమాచారం. అవి కూడా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేముందు ఏర్పాటు చేసుకున్నవి. ఆ తర్వాత ఎన్ని భవనాల యాజమాన్యాలు ఫైర్‌సేఫ్టీ నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నాయో, అసలు నిర్వహణ ఉందో లేదో తెలియని పరిస్థితి.
జనసమ్మర్థం ఎక్కువగా ఉండే షాపింగ్ కాంప్లెక్సులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, హాస్టళ్లు, సినిమాహాళ్లు, పబ్బులు, క్లబ్బులు చాలామటుకు ఫైర్‌సేఫ్టీ లేకుండానే కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆయా భవనాలకు ముఖ్యంగా పాఠశాలల భవనాలకు చుట్టూ ఆరుమీటర్ల ఖాళీ స్థలం ఉంటేనే ఫైర్ ఎన్‌ఓసీ ఇవ్వాలని గతేడాది జూన్ నుంచి కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. అయితే ఇప్పుడు అది ఎంతవరకు అమలు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నోటీసులతో సరి.. చర్యల్లేవ్..
గ్రేటర్లో 500 చ.మీ. స్థలంలో లేదా ఆరు మీటర్లు ఎత్తున్న భవనాల నుంచి 15 మీటర్ల ఎత్తు వరకున్న భవనాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులిస్తుంది. అంతకంటే ఎక్కువ ఎత్తున్న విద్య, వ్యాపార, వాణిజ్య, తదితర భవనాలు, గోడౌన్లు, పరిశ్రమలకు రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం అనుమతులిస్తుంది. ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించనివారిపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం మినహా, తనంతతానుగా చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీకి అధికారం లేదు.
దీంతో ఆయా భవన యాజమాన్యాలకు నోటీసులిస్తున్నా స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫైర్‌సేఫ్టీలేని అస్పత్రులపై జిల్లా వైద్యాధికారుల ద్వారా, ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ ద్వారా, ఇతరత్రా సంస్థలపై సంబంధిత శాఖల ద్వారా ఆయా సంస్థల అనుమతులు, లైసెన్సులు రద్దు చేయించాలని భావించినప్పటికీ ఆ తర్వాత విస్మరించారు.
మేల్కొలిపిన ముంబై పబ్ దుర్ఘటన
గత డిసెంబర్‌లో ముంబైలో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటన అనంతరం అక్కడి ఫైర్ బ్రిగేడ్ విభాగాన్ని రెండు భాగాలుగా చేసి ఒక విభాగం తనిఖీలు చేయాలని, మరో విభాగం ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అన్ని సంస్థలను తనిఖీలు చేసి ఎన్‌ఓసీలు ఉండేలా చర్యలకు సిద్ధమయ్యారు. అక్కడ అప్పటికున్న 35 ఫైర్‌సేఫ్టీ నిబంధనల్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. థియేటర్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, షాపులు నిర్మాణాల్లో వినియోగించే సామగ్రి నుంచి ఫర్నిచర్‌కు వరకు అగ్నికి త్వరగా కాలిపోని సామగ్రిని వాడేలా నిబంధనల్లో పొందుపరచాలని భావించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన సంబంధిత అధికారులపై కూడా చర్యలకు సిద్ధమయ్యారు.
కానరాని తనిఖీలు..
ముంబై పబ్ ప్రమాద నేపథ్యంలో నగరంలోని పబ్బులు, క్లబ్బులు తదితర జనసమ్మర్థం ఉండే సంస్థలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం–పారిశుధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి భావించారు. తనిఖీల సమయంలోనే భవన నిర్మాణ అనుమతి, ట్రేడ్ లైసెన్సు, ఆస్తిపన్ను చెల్లింపు వంటి అంశాలనూ తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ అవి మాత్రం అమలుకు నోచుకోలేదు.
జీహెచ్‌ఎంసీ మూడేళ్ల క్రితం నోటీసులిచ్చిన.. ఎన్‌ఓసీలు పొందిన సంస్థలిలా
సంస్థలు సంఖ్య ఎన్‌ఓసీలు పొందినవి
1. ప్రైవేట్ ఆస్పత్రులు 1170 465
2. ప్రైవేట్ పాఠశాలలు 3023 899
3. ఫంక్షన్ హాళ్లు 707 34
4. టింబర్ డిపోలు 123 –
5. హోటళ్లు, రెస్టారెంట్లు 1608 171
6. హాస్టళ్లు 276 11
7. వస్త్రదుకాణాలు, షోరూమ్స్ 6124
8. ఎలక్ట్రికకల్,ఎలక్ట్రానిక్స్
షాపులు,షోరూమ్స్ 4827 01
9. బాణసంచా దుకాణాలు
(పర్మినెంట్) 68 –
10. ఆభరణాల దుకాణాలు 41 –
11. స్టోరేజ్(గోడౌన్లు) 1068 –
12. సినిమాహాళ్లు 90 16
13. పరిశ్రమలు – 16
14. బ్యాంకులు – 02
15. పెట్రోల్ బంకులు – 44
గత మూడేళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లకు జీహెచ్‌ఎంసీ
ఇచ్చిన నోటీసులు, ఎన్‌ఓసీలు..
సంవత్సరం నోటీసులు ఎన్‌ఓసీలు
2015 491 384
2016 400 352
2017 170 110
Comments
Please login to add a commentAdd a comment