సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆగ్రహంతో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ దిగొచ్చింది. చెల్లించాల్సిన బకాయిలను ఎట్టకేలకు సొసైటీ చెల్లించినట్లు ఉమ్మడి హైకోర్టుకు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మూసివేసినట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 నుంచి 2017 వరకు రూ.93.94 లక్షలకు రూ.64.96 లక్షలను గతంలోనే ఎగ్జిబిషన్ సొసైటీ చెల్లించిందని ప్రభుత్వ న్యాయవాది (హోం) టి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 7న మిగిలిన బకాయి మొత్తం రూ.28.97 లక్షలను అగ్నిమాపక శాఖకు ఎగ్జిబిషన్ సొసైటీ చెల్లించిందన్నారు.
2015లో అగ్నిమాపక శాఖకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ బకాయిలు చెల్లించడం లేదని న్యాయవాది ఖాజా అజాజుద్దీన్ ప్రజాప్రయో జన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2011 నుంచి 2016 వరకు ఉన్న రూ.80.14 లక్షల బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాల్ని ఎగ్జిబిషన్ సొసైటీ ఖాతరు చేయలేదు. దీంతో పిటిషనర్ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేయడంతో హైకోర్టు గతంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 7న మిగిలిన రూ.28.98 లక్షల మొత్తాన్ని చెల్లించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ఎగ్జిబిషన్ సొసైటీపై కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
‘సొసైటీ’పై కోర్టు ధిక్కార వ్యాజ్యానికి తెర
Published Sat, Nov 18 2017 3:17 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment