
అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించండి
జగ్గయ్యపేట : గ్రామాల్లోని ప్రజలకు అగ్ని ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణరావు పేర్కొన్నారు. పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అగ్నిమాపక కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బంది, వాహనాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం రాష్ట్ర సరిహద్దులో ఉండటంతోపాటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కావున సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని గ్రామాల్లో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సమాచారం ఉంటే ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. ప్రస్తుతం సాంకేతికరంగం పెరగటంతో సమాచారం కూడా త్వరితగతిన వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అగ్నిమాపక కేంద్రం రాష్ట్రంలోనే మోడల్ స్టేషన్‌గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.