బకాయిలు చెల్లించకుండానే అగ్నిమాపక సేవలా?
- ఎగ్జిబిషన్ సొసైటీ తీరుపై హైకోర్టు విస్మయం
- బకాయిలు చెల్లించనప్పుడు ఎందుకు అనుమతినిస్తున్నారు?
- వైఖరి చెబుతూ కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖకు చెల్లించాల్సిన రూ.80 లక్షలకు పైగా బకాయిలను చెల్లించకుండానే హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ సొసైటీ ఏటా ఎగ్జిబిషన్ సందర్భంగా ఆ శాఖ సేవలను వినియోగించుకుంటుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించనప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహణకు ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించింది. పైగా బకాయిల చెల్లింపు విషయంలో ఎగ్జిబిషన్ సొసైటీ మినహాయింపు కోరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బకాయిల వసూలు, ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతిపై వైఖరి తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖకు ఎగ్జిబిషన్ సొసైటీ రూ.68 లక్షల మేర బకాయి ఉందని, దీన్ని వడ్డీతో సహా సొసైటీ నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఖాజా అయాజుద్దీన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఏసీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
ఇప్పటి వరకు అగ్నిమాపక శాఖకు రూ.68 లక్షల మేర బకాయి ఉందని, వసూలుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కుమార్ అన్నారు. వడ్డీతో సహా రూ.80 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉందని హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ చెప్పారు. ఏటా ఎగ్జిబిషన్ సందర్భంగా నామమాత్రంగా లక్ష రూపాయలు చెల్లించి అగ్నిమాపక సేవలను వాడుకోవడం సొసైటీ అలవాటుగా చేసుకుందన్నారు. బకాయిల మినహాయింపును ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రజాధనం చెల్లించకుండా సాకులు చెబుతుంటే మీరేం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బకాయిలు చెల్లించనప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎందుకు అనుమతినిస్తున్నారని నిలదీసింది. 2017 జనవరిలో నిర్వహించబోయే ఎగ్జిబిషన్‌కు అనుమతినిచ్చే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.