Exhibition Society
-
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మరోసారి హరీశ్‌రావు
అబిడ్స్ (హైదరాబాద్): ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా 2వ సారి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు, ఉపాధ్యక్షుడిగా అశ్వినీ మార్గం, కార్యదర్శిగా సాయినాథ్ దయాకర్ శాస్త్రి, సంయుక్త కార్యదర్శి వనం సురేందర్, కోశాధికారిగా పాపయ్య చక్రవర్తితోపాటు మరో ఏడుగురు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేయగా, పోటీగా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. కొత్త కమిటీని 30న ఎగ్జిబిషన్ సొసైటీ అధికారికంగా ప్రకటించనుంది. -
నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో రద్దయ్యింది. ఈ ప్రదర్శన కోసం జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సుమారు 1500 స్టాళ్లను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను స్టాళ్ల నిర్వాహకుల నుంచి రూ.లక్ష రూపాయల అద్దె, ఇతరత్రా బిల్లులను సైతం తీసుకున్నారు. వీటిని తిరిగి శుక్రవారం నిర్వాహకులకు వాపస్ ఇచ్చేశారు. దీంతో చాలా మంది స్టాళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. తెచ్చిన సరుకును ప్యాక్ చేసుకుని వాహనాల్లో వారి స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. ఎగ్జిబిషన్ అకస్మాత్తుగా మూతపడడంతో సొసైటీకి, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. నష్టం రూ.200 కోట్లు ఎగ్జిబిషన్ ఈ ఏడాదీ శాశ్వతంగా మూతపడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నందున నుమాయిష్‌కు అనుమతి ఇవ్వలేమంటూ సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రెండో ఏడాది నుమాయిష్ వచ్చినట్టే వచ్చి కనుమరుగైంది. దాదాపు 2 వేల దుకాణాలు కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ ఎగ్జిబిషన్ సొంతం. ఇది సుదీర్ఘ కాలం సాగే ప్రదర్శన కావడంతో కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్.. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి దాదాపుగా 400 మంది వ్యాపారులు, సంబంధీకులు వచ్చేశారు. వీరిలో కొందరు చుట్టుపక్కల హోటల్స్‌లో, పేయింగ్ గెస్ట్ అకామడేషన్లలో బస చేశారు. ‘స్టాల్ కోసం రూ.లక్ష అద్దె చెల్లించా. రూ. 20వేలు జీఎస్టీ, రూ.25 వేల వరకు కరెంట్ బిల్లు కట్టాను. ఇవిగాక ప్రయాణ ఖర్చులూ వృథా అయ్యాయి’ అంటూ వాపో యాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారి. (చదవండి: కోవిడ్ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి) నిర్వాహకులు విలవిల.. ఇప్పటికే రూ.60 లక్షల వ్యయంతో స్టాళ్లు నిర్మించి, అనుమతి కోసం టౌన్ ప్లానింగ్ ఫీజ్ కింద రూ.74లక్షలు చెల్లించామని, ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ రూ.50లక్షలు కట్టామని నుమాయిష్ సెక్రటరీ చెప్పారు. తక్కువ ఫీజుతో నిర్వహించే 19 పాఠశాలలు, కాలేజీలకు ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఎగ్జిబిషన్ ఆదాయం నుంచి సబ్సిడీగా వెచ్చిస్తారు. వరుసగా రెండేళ్లు నుమాయిష్ మూత పడడంతో ఈ విద్యాసేవలకు గండిపడినట్టే. (చదవండి: ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది) తీవ్రంగా నష్టపోయాం.. డ్రైఫ్రూట్స్ స్టాల్ తీసుకున్నాను. దీనికోసం అప్పు చేశాను. డ్రైఫ్రూట్స్ పాడైపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోతుంది. తీవ్రమైన నష్టాల పాలవుతాం. – ఆసిఫ్, కశ్మీర్ నిండా మునిగాం.. 10 రోజుల తర్వాతైనా అనుమతిస్తారనే ఆశతో పనివాళ్లతో కలిపి రూమ్స్ అద్దెకు తీసుకున్నాం. ఇప్పటికే రూ.7 లక్షల విలువైన మెటీరియల్ తీసుకొచ్చాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. – ఇమ్రాన్ హుస్సేన్, వస్త్రవ్యాపారి, శ్రీనగర్ -
‘ఎగ్జిబిషన్’ నూతన అధ్యక్షుడిగా హరీశ్‌రావు ఏకగ్రీవం
అబిడ్స్ (హైదరాబాద్): ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎన్నికయ్యారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ కార్యాలయంలో జరిగిన ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆరున్నర ఏళ్ల పాటు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొన్ని నెలల కిందట రాజీనామా చేయడంతో.. హరీశ్‌రావును నూతన అధ్యక్షుడిగా నియమించారు. 2021–22 ఏడాదికి ఈ నూతన కమిటీ అధికారంలో కొనసాగుతుంది. ఉపాధ్యక్షుడిగా బి.ప్రభాశంకర్, గౌరవ కార్యదర్శిగా ఆదిత్య మార్గం, జాయింట్ సెక్రెటరీగా చంద్రశేఖర్, కోశాధికారిగా ధీరజ్‌కుమార్ జైస్వాల్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా మహ్మద్ ఫయుంఉద్దీన్, పాపయ్య చక్రవర్తి, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సాజిద్ మహ్మద్ అహ్మద్, వనం సత్యేందర్, సురేశ్‌రాజ్, వంశీ తిలక్‌లు ఎంపికయ్యారు. -
సీఎం కేసీఆర్‌కు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి లేఖ
-
సీఎం కేసీఆర్‌కు లాల్‌బహదూర్‌శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు నేపథ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు లాల్‌బహదూర్‌శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ రాశారు. రెండేళ్ల క్రితమే ఎగ్జిబిషన్ సొసైటీ లీజ్ ముగిసినా అక్రమంగా కార్యకలాపాలు సాగించినట్లు లేఖలో పేర్కొన్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా 62 మందికి మెంబర్‌షిప్‌లు ఇచ్చారన్నారు. గత మూడేళ్లలో కొత్తగా మెంబర్షిప్ పొందినవారిని సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆడిట్ సక్రమంగా జరగలేదని తెలిపారు. కాలేజీ నిధులను సైతం మళ్లించారని.. ప్రశ్నించినందుకు తన సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ లేఖలో రవీంద్రసేన పేర్కొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరేళ్లు పనిచేశారు. ఆయన ప్రెసిడెండట్‌గా ఉన్న సమయంలో సొసైటీలో మెంబర్‌షిప్‌లు ఇస్టానుసారంగా ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో సొసైటీ ఆడిట్ సెక్షన్లో రెండు రోజు దనిఖీల్లో భాగంగా ఏసీబీ రికార్డులను పరిశీలిస్తున్నారు. -
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ మాట్లాడుతూ.. 80సంవత్సరాల నుండి ఎగ్జిబిషన్ నడిపిస్తున్నామని, అకస్మాత్తుగా ఈ రోజు ఎగ్జిబిషన్ సొసైటీ పైన విచారణ చేస్తామని ఏసీబీ సిబ్బంది వచ్చారన్నారు. ఏసీబీ వాళ్లకు ఫిర్యాదు వచ్చిందని మాకు చెప్పి తనీఖీలు చేస్తున్నారుని, అయినా మా సొసైటీ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన అన్నారు. సొసైటీ కార్యకలాపాలు అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అకౌంట్స్ అన్ని ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తామని, సొసైటీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కాగా మొట్టమొదటి సారిగా సొసైటీ మీద ఏసీబీ సోదాలు చేస్తున్నారని చెప్పారు. చదవండి: Work From Home Survey: ఆఫీసుకు వెళ్తేనే అసలు మజా! -
మరో కీలక పదవికి ఈటల రాజీనామా: ఆ పోస్టు కేటీఆర్‌కు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక పదవికి ఆయన రాజీనామా చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈటల తాజాగా మంగళవారం ఆ పదవిని కూడా వదులుకున్నారు. స్వరాష్ట్రం తెలంగాణ సాధించుకున్న 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల కొనసాగుతున్నారు. రాజీనామా పత్రాన్ని తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సొసైటీ కార్యదర్శికి ఈటల రాజేందర్ పంపించారు. ఈటల రాజీనామాను సొసైటీ పాలకమండలి సభ్యుల సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఎగ్జిబిషన్ సొసైటీ తదుపరి అధ్యక్షుడిగా మంత్రి కేటీఆర్‌ను నియమించాలనే ఆలోచనలో పాలకమండలి ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత రానుంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన పదవులన్నింటిని ఈటల వదులుకుంటున్నారు. చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్ చదవండి: క్షేమంగా ఇంటికి చేరిన ఈటల -
99 యేళ్ల లీజ్ ఘనత.. టీఆర్ఎస్ ప్రభుత్వానిదే
గన్‌ఫౌండ్రీ : ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలాన్ని 99 సంవత్సరాలు లీజ్‌కు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ముగింపు ఉత్సవాల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో నిర్వహించే నుమాయిష్ ప్రదర్శన ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి రాష్ట్రంగా అభివర్ణింపజేస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ ఏడాది కొంత వ్యాపారం తగ్గిందన్నారు. విద్యాభివృద్ధికి పాటుపడుతున్న సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక్కటేనన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సామాన్య విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జమ్మూకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారులు నుమాయిష్‌లో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. అనంతరం పలు కళాశాలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను, నుమాయిష్ ప్రదర్శనలో అత్యంత వ్యాపారం చేసిన స్టాల్ యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యా మార్గం, సొసైటీ ప్రతినిధులు రంగారెడ్డి, సుఖేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకుండానే అగ్నిమాపక సేవలా?
ఎగ్జిబిషన్ సొసైటీ తీరుపై హైకోర్టు విస్మయం బకాయిలు చెల్లించనప్పుడు ఎందుకు అనుమతినిస్తున్నారు? వైఖరి చెబుతూ కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖకు చెల్లించాల్సిన రూ.80 లక్షలకు పైగా బకాయిలను చెల్లించకుండానే హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ సొసైటీ ఏటా ఎగ్జిబిషన్ సందర్భంగా ఆ శాఖ సేవలను వినియోగించుకుంటుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించనప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహణకు ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించింది. పైగా బకాయిల చెల్లింపు విషయంలో ఎగ్జిబిషన్ సొసైటీ మినహాయింపు కోరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బకాయిల వసూలు, ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతిపై వైఖరి తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖకు ఎగ్జిబిషన్ సొసైటీ రూ.68 లక్షల మేర బకాయి ఉందని, దీన్ని వడ్డీతో సహా సొసైటీ నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఖాజా అయాజుద్దీన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఏసీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఇప్పటి వరకు అగ్నిమాపక శాఖకు రూ.68 లక్షల మేర బకాయి ఉందని, వసూలుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కుమార్ అన్నారు. వడ్డీతో సహా రూ.80 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉందని హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ చెప్పారు. ఏటా ఎగ్జిబిషన్ సందర్భంగా నామమాత్రంగా లక్ష రూపాయలు చెల్లించి అగ్నిమాపక సేవలను వాడుకోవడం సొసైటీ అలవాటుగా చేసుకుందన్నారు. బకాయిల మినహాయింపును ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రజాధనం చెల్లించకుండా సాకులు చెబుతుంటే మీరేం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బకాయిలు చెల్లించనప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎందుకు అనుమతినిస్తున్నారని నిలదీసింది. 2017 జనవరిలో నిర్వహించబోయే ఎగ్జిబిషన్‌కు అనుమతినిచ్చే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు ఆదర్శనీయం: కేసీఆర్
హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తార్నాక విజయపురి కాలనీలో ఇటీవల నూతన హంగులతో నిర్మించిన సరోజిని నాయుడు వనితా ఫార్మసీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సరోజిని నాయుడు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం పాలనలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీని నాటి ‘బాగ్-ఈ-ఆమ్’ నేటి పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనంతరం ఇప్పుడున్న స్థలంలో ఎగ్జిబిషన్ సొసైటీని మార్చారని పేర్కొన్నారు. ఈ సొసైటీ తెలంగాణ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు 19 విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదానికి దీటుగా ఎగ్జిబిషన్ మైదానం వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ శాసన సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌రెడ్డి, కళాశాల చైర్మన్ పి. హరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వి. జ్యోతి, సెక్రటరీ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.