99 యేళ్ల లీజ్ ఘనత.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే
గన్‌ఫౌండ్రీ : ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలాన్ని 99 సంవత్సరాలు లీజ్‌కు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ముగింపు ఉత్సవాల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో నిర్వహించే నుమాయిష్ ప్రదర్శన ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి రాష్ట్రంగా అభివర్ణింపజేస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ ఏడాది కొంత వ్యాపారం తగ్గిందన్నారు. విద్యాభివృద్ధికి పాటుపడుతున్న సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక్కటేనన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సామాన్య విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జమ్మూకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారులు నుమాయిష్‌లో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. అనంతరం పలు కళాశాలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను, నుమాయిష్ ప్రదర్శనలో అత్యంత వ్యాపారం చేసిన స్టాల్ యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యా మార్గం, సొసైటీ ప్రతినిధులు రంగారెడ్డి, సుఖేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.