సాక్షిప్రతినిధి, ఖమ్మం: నగరంలో సోమవారం భారీ విప్ఫోటం జరిగింది. ఓ భవనం కుప్పకూలగా.. మంటల్లో చిక్కుకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 20 దుకాణాల వరకు దెబ్బతిన్నాయి. భారీ శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం.. భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రూ.కోటికి పైగా ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచడంతో అవి పేలాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలి అయిన కమాన్‌బజార్‌లో బెందెడి రవీంద్రనాథ్‌కు చెందిన భవనంలో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన దేవాండ్ల శ్రీనివాస్ ‘నానో శ్రీనివాస్’పేరుతో గతేడాది నుంచి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. అద్దె సరిగా చెల్లించకపోవడంతో దుకాణం ఖాళీ చేయాలని యజమాని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ మూడు రోజులుగా ఆ పనిలోనే ఉన్నాడు.
పేలుడు పదార్థాలే కారణమా?
భారీ శబ్ధానికి స్థానికులు ఏం జరిగిందో తెలియక భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. దుకాణంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచి ఉండవచ్చని, అవి ప్రమాదవశాత్తు పేలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోగానీ, సిలిండర్లకు సైతం ఇంతటి స్థాయిలో పేలుడు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ భారీ విస్ఫోటానికి 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేరు. అయితే.. వెనుక ఉన్న భవనంలో వస్త్ర దుకాణం వ్యాపారి శ్రీనివాస్ నిద్రిస్తున్నాడు. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో అతను చిక్కుకున్నాడు. తనను కాపాడాలని అతను గట్టిగా కేకలు వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది వెనుక భవనం నుంచి దిగి నిచ్చెన ద్వారా బయటకు తీసి.. 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను 50 శాతం వరకు కాలిపోయాడు.
ఎస్పీ సందర్శన
రూ.కోట్లాది వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు ఆ ప్రాంతానికి తండోప తండాలుగా చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో శకలాలను రెండు జేసీబీల ద్వారా తొలగించారు. అయితే ఘటనా స్థలం వద్ద ఏపీ లోని కడప జిల్లా రాయచోటికి చెందిన ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు వచ్చి ఈ షాపులో తిరిగారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనలపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మంలో భారీ విస్ఫోటం
Published Tue, Oct 30 2018 1:13 AM | Last Updated on Tue, Oct 30 2018 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment