అగ్గి రాజుకుంటే అంతే!
- రాష్ట్రంలో తగినన్ని లేని అగ్నిమాపక కేంద్రాలు
- 15 నియోజకవర్గాల్లో కానరాని ఫైర్ స్టేషన్లు
- పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అందుబాటులో ఒకే ఒక్క డీసీపీ వాహనం
- శిథిలాల తొలగింపునకు వాడుతున్నది ఒకే రెస్క్యూ టెండర్
- అగ్నిమాపక శాఖలో గుబులు రేపుతున్న వేసవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు అగ్నిమాపక శాఖను వణికిస్తున్నాయి. పరికరాల లేమి, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఎక్కడైనా అగ్గిరాజుకుంటే పరిస్థితి ఏమిటనే గుబులు రేపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 90 ఫైర్ స్టేషన్లు అందుబాటులో ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికీ ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో ప్రకటించింది. కానీ గడిచిన మూడేళ్లలో కేవలం నాలుగు ఫైర్ స్టేషన్లే ఏర్పాటయ్యాయి. ఇంకా 15 నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్ల అవసరముంది.
ఈ నియోజకవర్గాల్లో అగ్నిప్రమాదం జరిగితే పక్క నియోజకవర్గం నుంచి ఫైరింజన్ వచ్చి మంటలార్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్ర ఏర్పాటు వరకు ఉన్న 16 ఔట్ పోస్టులను అగ్నిమాపక కేంద్రాలుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించినా అవి పూర్తిస్థాయి స్టేషన్లుగా అందుబాటులోకి రాలేదు. దీంతో చేసేదేమీ లేక అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ప్రతిసారీ బడ్జెట్‌కు ముందు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. ప్రభుత్వం యథావిధిగా మొండిచేయి చూపిస్తూనే ఉంది.
ఆందోళన కలిగిస్తున్న కీలక యూనిట్లు...
పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల తీవ్రత ఎంతగా ఉంటుందో గతంలో జరిగిన ప్రమాదా లు స్పష్టం చేస్తున్నాయి. పరిశ్రమల్లో ప్రమా దాలు జరిగితే ఉపయోగించే డీసీపీ టెండర్ (స్పెషల్ ఫైర్ ఇంజన్) రాష్ట్రం మొత్తం మీద ఒక్కటి ఉంది. అది కూడా కేవలం హైదరాబా ద్‌లోనే అందుబాటులో ఉంది. అలాగే భారీ భవ నాలు కూలినప్పుడు, రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు శిథిలాల నుంచి క్షతగాత్రులను గుర్తించే సాధనం(రెస్క్యూ టెండర్) కూడా ఒక్కటి అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అదే విధంగా కెమికల్ కంపెనీల్లో రియాక్టర్ల పేలుళ్లు, రసాయన పదార్థాల వల్ల జరిగే ప్రమాదాలను ఆర్పేందుకు ఉపయోగించే ఫోమ్ టెండర్ సైతం ఒకే ఒక్కటి ఉండటం అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని నిర్ఘాంతపరుస్తోంది. దీనికితోడు హై ప్రెజర్‌వాటర్ ట్యాంకర్స్ కేవలం మూడే అందుబాటులో ఉన్నాయి. భారీ భవనాల్లో ప్రమాదాలు జరిగితే ఉపయోగించేందుకు కేవలం ఒకే ఒక్క హైడ్రాలిక్ ఫ్లాట్‌ఫాం అందు బాటులో ఉండగా 18 ఫ్లోర్ల ఎత్త వరకు చేరుకో గలిగే బ్రాంటో హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్స్ రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
1,208 చదరపు కిలోమీటర్లకు ఒక్కటే...
అగ్నిమాపక శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 చదరపు కిలోమీటర్లకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. కానీ ప్రస్తుతం 1,208 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్ స్టేషన్ ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపక శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నగరాల్లో ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్ స్టేషన్ తప్పనిసరికాగా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడంలేదు. జనాభాను బట్టి చూసినా ప్రతి 50 వేల మందికి ఒక అగ్నిమాపక కేంద్రం అందుబాటులో ఉండాల్సి ఉం డగా ప్రస్తుతం ప్రతి 3.78 లక్షల మందికి ఒకే ఒక్క ఫైర్ స్టేషన్ ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.