‘పంట’ల కారు...!
-
ఇదోరకం ఎత్తిపోతల పధకం
-
అగ్నిమాపక శాఖ అధికారదుర్వినియోగం
-
ఫైర్ ఇంజన్లతో పంటలకు నీరు
పిఠాపురం :
అగ్నిప్రమాదం జరిగితే గంటల తరబడి రాని రెండు ఫైర్ ఇంజిన్లు ... 20 మంది సిబ్బంది ... ఉరుకులు పరుగులతో సైరన్ మోగించుకుంటూ రయ్యిన దూసుకుపోయాయి. ఆ హడావుడి చూసినవారు ఎక్కడో ఏదో పెద్ద అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని కంగారుపడిపోయారు. ఇంతకూ ఆ ఫైర్ ఇంజిన్లు వెళ్లింది మంటలు ఆర్పడానికి కాదు ... పంటలకు నీరు తోడుకోడానికి. ఇదేమిటీ ఫైర్ ఇంజిన్లు పంట పొలాలకు నీరు తోడడమేమిటీ అని అనుకుంటున్నారా...! అదేనండి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీస్ వర్మ రచించిన ఇదో కొత్తరకం ‘ఎత్తిపోతల... పథకం’. తన అనుచరుల పంట పొలాలకు నీరు అవసరం పడడంతో ఈ పథకానికి తెరదీశారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే వెళ్లాల్సిన అగ్నిమాపక శకటాలు ... సిబ్బందిని తన అధికార దుర్వినియోగంతో బలవంతంగా తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం పట్ల ఈ ప్రాంతవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గంలో నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నానంటూ ప్రకటనలు గుప్పించిన సదరు ఎమ్మెల్యే చెప్పే మాటలకు ... చేసే పనులకు పొంతన లేదనడానికి ఈ సంఘటనే తార్కాణం. పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఎదురై ఇప్పటికే నాట్లు పడక రైతులు పాట్లు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడక్కడా నాట్లు పడ్డాయి. గత ఐదు రోజులుగా ఎండలు మండిపోవడంతో నాట్లు వేసిన పంటలు బీటలు వారడం ప్రారంభించాయి. ఏలేరు, పీబీసీల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే ఆ దిశగా నీరు రప్పించలేక చివరకు అత్యవసర వాహనాలైన ఫైర్ ఇంజిన్లను రప్పించి పీబీసీలో నీటిని తోడించి పైపుల ద్వారా పంటలకు నీరు మళ్లించడం చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవలే సాగునీటి ఎద్దడి ఉన్న రైతులు కాలువల్లో నీరు తోడుకునేందుకు వీలుగా ఇదే ఎమ్మెల్యే రాయితీపై ఆయిల్ ఇంజిన్లు పంపిణీ చేశారు. వాటిని పక్కన పెట్టి కాలువ పక్కనే (పీబీసీ) ఉన్న పంట పొలాలకు ఫైర్ ఇంజిన్లతో భారీగా నీరు తోడించడముమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతా ఎమ్మెల్యే ఆదేశానుసారమే...
మంటలు ఆర్పాల్సిన మీరు పంటలకు నీరు తోడడమేమిటని అక్కడున్న అగ్నిమాపక అధికారి వీవీఎస్ భావనారాయణను ‘సాక్షి’ ప్రశ్నించగా ఎమ్మెల్యే వర్మ ఆదేశాల మేరకు తాము ఇలా చేయవలసి వచ్చిందని చెప్పారు. మరి ఏదైనా ప్రమాదం సంభవిస్తే మి చేస్తారని అడగ్గా ‘వీలుకుదిరితే వెళతాం లేకపోతే మేమేం చేయలేం’ అంటూ తన అసక్తతను చెప్పుకొచ్చారు.