
రక్తదానం సామాజిక బాధ్యత
రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి(డీఎఫ్‌వో) సారంగి సందన్న...
డీఎఫ్‌వో సందన్న
► ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
► రక్తదానం చేసిన అధికారులు, సిబ్బంది
► విశ్రాంత ఉద్యోగులకు సన్మానం
ఆదిలాబాద్ క్రైం : రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి(డీఎఫ్‌వో) సారంగి సందన్న అన్నారు. వారం రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న అగ్నిమాపక శాఖ వారోత్సవాలు బుధవారంతో ముగిసాయి. చివరి రోజు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీఎఫ్‌వో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అగ్నిమాపక కేంద్రాల అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. చాలామందికి రక్తదానంపై అపోహాలు ఉన్నాయని, రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌వో ధర్మ, ఆదిలాబాద్ ఫైర్ అధికారి అనిల్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగులకు సన్మానం
అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు సందర్భంగా అగ్నిమాపక శాఖ విశ్రాంత ఉద్యోగులకు జిల్లా అగ్నిమాపక కేంద్రంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 మంది ఉద్యోగులకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. విశ్రాంత ఉద్యోగులు చుట్టుపక్కల వారికి తమవంతుగా అగ్నిప్రమాదాల నివారణపై వివరిస్తూ ఉండాలని పేర్కొన్నారు.