అగ్నిమాపక శాఖలో పిరమిడ్ లొల్లి
► ఏడాదిగా ఎన్‌వోసీలు జారీ చేయని అగ్నిమాపక శాఖ
► న్యాయం కోసం కోర్టుకెళుతున్న డెవలపర్లు
► సానుకూలంగా తీర్పు వస్తే.. దాన్నీ అప్పీల్ చేస్తున్న శాఖ
► అనుమతుల కోసం 15 లక్షల చ.అ. నిర్మాణాలు ఎదురుచూపు
► ఫీజులు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడైనా సరే నిర్మాణ అనుమతుల నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) జారీ కోసం ఎక్కడికెళతారంటే? ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ‘సంబంధిత ప్రభుత్వ విభాగానికి అని’! కానీ, భాగ్యనగరంలో మాత్రం న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి వస్తోంది! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి మరి.
నగరంలో భవనాలన్నీ ఒకే ఆకారంలో కాకుండా విభిన్న డిజైన్లలో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నం.168ను తీసుకొచ్చింది. జీవో ప్రకారం స్టెప్ట్/ పోడియం ఆకారంలో నిర్మాణాలకు 5వ అంతస్తు వరకు 9 మీటర్ల సెట్‌బ్యాక్, ఆపైన 5 అంతస్తుల వరకు 1 మీటర్ సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన ఉంది. అయితే ఆయా నిబంధనల ప్రకారం అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయట్లేదని డెవలపర్ల వాదన.
⇒ ఒకవైపు ఎన్‌వోసీ రాక, మరోవైపు తెచ్చుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక విసిగిపోయిన ఓ డెవలపర్ గతంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. జీవో నిబంధనలు, డెవలపర్ వాదనను విన్న నాయయస్థానం సానుకూలంగా తీర్పునిచ్చింది. ‘‘ఆహా.. నువ్వు నా మీదే కోర్టుకు వెళతావా? ఇక నీకు ఎన్‌వోసీ ఎలా వస్తుందో చూసుకుంటానని’’ వ్యక్తిగతంగా తీసుకున్న సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారి ఆ ఒక్క డెవలపర్‌దే కాదు పిరమిడ్ ఆకారంలోని ఏ నిర్మాణాలకూ ఎన్‌వోసీ జారీ చేయట్లేదు. ఇలా గత ఏడాది కాలంగా అగ్నిమాపక శాఖలో సుమారు 20కి పైగా ఫైళ్లు పడిఉన్నాయని సమాచారం.
అంతే.. నేనింతే!
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. డెవలపర్‌కు సానుకూలంగా కోర్టు తీర్పునిస్తే.. దాని మీద సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారి పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం!
⇒ ఎలాగోలా ఈ లొల్లి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధికి చేరింది. అయితే ఇప్పుడు సంబంధిత శాఖ అగ్నిమాపక శాఖకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? అసలీ సమస్యపై ఎలాంటి వివరణ కోరుతుందని డెవలపర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు కోర్టు తీర్పునూ కాదంటూ.. ఇటు ప్రభుత్వమూ పట్టించుకోకపోతే ఇక ఈ సమస్యకు పరిష్కారమెలానని డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు.
⇒ ప్రస్తుతం నగరంలో చాలా భవంతులు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. మరో 15 నిర్మాణ సంస్థలు సుమారు 15–20 లక్షల చ.అ.ల్లో పిరమిడ్ ఆకారంలో భవంతులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క అధికారి మొండి పట్టుదలతో ఫీజులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడింది. మరోవైపు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలూ దూరమయ్యాయి.